Agency Giri villages | ఇంద్రవెల్లి : ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలు చేస్తేనే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మకం. మండలంలోని పోల్లుగూడ, వాల్గొండా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వనంలో వన దేవత (అకాడీ) ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం సంప్రదాయ ప్రకారం చిన్న పెద్ద తేడలు లేకుండా మొక్కుకున్నారు.
వారి సంప్రదాయ బద్ధంగా వనదేవత మందు వ్యవసాయ పనిముట్లు, అడవి బర్రెల కొమ్ములు పెట్టి వాటికి అకాడి పూజలు నిర్వహించి నైవేధ్యం సమర్పించి మొక్కుకున్నారు. ముందుగా గ్రామ పోలిమేరలో పోచమ్మ తల్లి వద్ద పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు. పంటలు బాగా పండాలని అడవి జంతువుల నుంచి పశువులకు రక్షణ కల్పించాలని వనదేవత మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేసి గ్రామంలోని పశువులను అడవి ప్రాంతంలోని వనదేవతకు ప్రదర్శనలు చేయించారు. గ్రామాల్లో చేను కలుపు పనులు. దండారీ ఉత్సవాల నృత్యాలకు శ్రీకారం చుడుతున్నట్లు గిరిజన పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.