మంచిర్యాల, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షలతో పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంటర్ పూర్తయ్యాక అ క్కడే డిగ్రీ చదవాలని బలవంతం చేస్తూ.. ఒకవేళ వినకుంటే సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడమేగాక డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలుండగా, యంత్రాం గం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మిమ్స్ జూనియర్ కళాశాల అధికారిక రికార్డుల ప్రకారం మంచిర్యాల గోదావరికి వెళ్లే రోడ్డులో ఉంది. అక్కడి నుంచి బైపాస్ రోడ్డులోని కొత్త భవనం (ఐఐటీ అండ్ నీట్) క్యాంపస్‌కు మారేందుకు కళాశాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కళాశాల భవనం నిబంధనల మేరకు లేదన్న కారణంతో ఇంటర్‌బోర్డు దానికి అనుమతులు ఇవ్వలేదని తెలిసింది. బోర్డు నుంచి అనుమతులు రాకున్నా.. బైపాస్ రోడ్డులోని భవనంలో ఐఐటీ అండ్ నీట్ జూనియర్ కాలేజీని ప్రారంభించి, ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తాలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులకు ఇదే భవనంపై హాస్టల్ వసతి కల్పించారు. కానీ భవన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అయితే హాస్టల్ నిర్వహిస్తున్న మూడో ఫ్లోర్లో కిటికీలకు గ్రిల్స్ కూడా బిగించకపోవడంతో ఇంటర్ విద్యార్థిని కొత్తపల్లి సహస్ర(18) అందులో నుంచి పడి మృతి చెందినట్లు తెలుస్తున్నది, కానీ ఇప్పటికీ ఆమె మృతిపై అనేక అనుమానాలుండగా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతుంటే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా అధికారులు ఇంత కాలం ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కేజీ నుంచి పీజీ దాకా మా దగ్గరే చదవాలంటూ సదరు కళాశాల యాజమాన్యం విద్యార్థులను బలవంతం చేస్తున్నట్లు తెలిసింది. ఇంటర్లో జాయిన్ అయ్యే సమయంలో డిగ్రీ కూడా మా దగ్గరే చేయా లని కమిట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంటర్ పూర్తి చేశాక వేరే కాలేజీలో చేరాలనుకుంటే డిగ్రీ కమిట్మెంట్ ఇచ్చి మధ్యలో వెళ్లిపోతున్న కారణంగా అదనంగా డబ్బులు ఇస్తేనే టీసీ జారీ చేస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల ఓ విద్యార్థిని జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి నేరుగా ఫిర్యాదు చేసింది. 2021-23 విద్యాసంవత్సరంలో మిమ్స్‌లో ఉటూరి మైత్రీ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం రూ.10వేలు, సెకండ్ ఇయర్ రూ.12వేలకు మాట్లాడుకున్నారు. ఈ మేరకు మొత్తం ఫీజు, పరీక్ష ఫీజు, ఇతర ఫీజులు సైతం చెల్లించారు. ప్రస్తుతం మైత్రీకి టీఎస్ బీ.ఆర్చ్(అగ్రికల్చర్ డిగ్రీ) కౌన్సెలింగ్‌కు ఇంటర్ టీసీ అవసరం పడింది. ఈ మేరకు కాలేజీలో సంప్రదించగా డిగ్రీ కూడా మా కాలేజీలోనే చేస్తామని కమిట్మెంట్ ఇ చ్చారు. ఇప్పుడు టీసీ కావాలంటే రూ.56 వేలు కట్టాల్సిందేనని కళాశాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 30న కౌన్సెలింగ్ ఉన్న నేపథ్యంలో దౌర్జన్యంగా తన టీసీ ఆపుతున్నారని, ఎలాగైనా టీసీ ఇప్పించాలంటూ బాధిత విద్యార్థిని డీఐఈవోకు ఫిర్యాదు చేసింది. సాయితేజ అనే మరో విద్యార్థి 2017-18 ఇదే కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో డ్యూ పేరుతో గతంలో కట్టినవి కాకుండా రూ.13 వేలు కట్టించుకున్నారు. ఈ మేరకు రిసీఫ్ట్ కూడా ఇచ్చారు. డబ్బులు కట్టాక కూడా కట్టలేదని మెమో ఇవ్వడం లేదని, డబ్బులు రిసీఫ్ట్ సైతం నా దగ్గర ఉందని బాధిత విద్యార్థి చెబుతున్నాడు. ఇప్పటికీ నా ఇంటర్ మెమో కాలేజీలోనే ఉండిపోయిందని.. ఎలాగైనా ఇప్పించాలని సదరు విద్యార్థి వేడుకుంటున్నారు. ఇలా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సదరు కాలేజీ ఇబ్బందులు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు సైతం పలు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
అనుమతులు లేని భవనంలో తరగతులు నిర్వహించడం కాలేజీకి కొత్త కాదని తెలిసింది. గతంలోనూ ఈ తరహాలో అనుమతి లేని భవనంలో తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం వేంపల్లి శివారులోని ఎస్‌ఆర్‌కేఎం నర్సింగ్ కాలేజీ గర్ట్స్ హాస్టల్ పైనే మిమ్స్ ఇంటర్ రెండో తరగతి చదవే బాయ్స్ హాస్టల్ సైతం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేశారు.. ఇన్ని రోజులు పట్టించుకోని అధికారులు హాస్టల్ భవనం పై నుంచి విద్యార్థి పడిపోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) అంజయ్యను వివరణ కోరగా.. మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ క్యాంపస్ నిర్వహిస్తున్నట్లు భవనానికి బోర్డు అనుమతి ఇవ్వలేదన్నారు. ఆ భవనంలో అనధికారికంగా తరగతులు చెబుతున్నట్లు గుర్తించామన్నారు. అదే భవనంలో హాస్టల్ సైతం నడిపిస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.