మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి, పెన్‌గంగ నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నది. చేలల్లో నీరు నిల్వడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.
కడెం, జూన్ 27: కడెం ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీ)లు కాగా, ప్రస్తుతం 678.450 అడుగులు (2.792 టీఎంసీ)ల వద్ద ఉంది. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2584 ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నదని అధికారులు తెలిపారు.
తాంసి, జూన్ 27 : మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లకు గాను ప్రస్తుతం 274 మీటర్లు ఉందని అధికారులు శుక్రవారం తెలిపారు. నీటి సా మర్థ్యం 0.571 టీఎంసీలకు ప్రస్తుతం 0.179 టీఎంసీ ఉందన్నారు. 24 గంటల్లో 405 క్యూసెకుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారి హరీశ్ కుమార్ వెల్లడించారు.
భీంపూర్, జూన్27: వర్షాలతో భీంపూర్ మండల సరిహద్దు పెన్‌గంగ నిండుగా ప్రవహిస్తున్నది. గుబిడి, గోముత్రి, అంతర్గాం, అర్లి(టీ), వడూర్, గొల్లగడ్, తాంసి(కె) రేవుల నుంచి అటు మహారాష్ట్రకు పెన్‌గంగలో ప్రస్తుతం నాటుపడవలు నడపడం లేదు. వర్షాల నేపథ్యంలో పెన్‌గంగ పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతో కరంజి(టీ), గుబిడి రోడ్డు గుంతలతో బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.