ఆదిలాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వారు. పరిసర ప్రాంతాలు నివాస స్థలాలు మారడంతో కుంట స్థలం క్రమంగా అక్రమణలకు గురైందని స్థానికులు అంటున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కుంట నిర్వహణను గాలికి వదిలేయడంతో పూడిక పేరుకుపోవడంతోపాటు పచ్చి మొక్కలు, చెట్లతో నిండిపోయింది.
వానకాలంలో కుంట పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమణలతోపాటు పూడిక పేరుకుపోవడం, పిచ్చి మొక్కలతో కుమ్మరికుంట నిండిపోవడంతో నీటినిల్వ సామర్థ్యం బాగా తగ్గింది. భారీ వర్షం కురిస్తే నీరు బయటకు పోయే అవకాశం లేకపోవడంతో ఇండ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. శుక్రవారం వర్షానికి పలు ఇండ్లలోకి నీరు రాగా ఓ ఇళ్లు దెబ్బతింది. వరదనీటితోపాటు చెత్తాచెదారం, బురద, ఇసుక, విష పురుగులు, వ్యర్థాలు ఇండ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటిని శుభ్రం చేసుకునేందుకు కష్టాలు పడాల్సి వస్తుంది. వరదనీటితో ఇంటి పరిసరాలు కోతకు గురై ఇండ్ల పునాదులు తేలుతున్నాయి. మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి అక్రమణలు తొలగించి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.