కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంటలు దెబ్బతినడంతోపాటు ఆస్తినష్టం జరిగింది. ఈ క్రమంలో వరద నష్టంపై బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు వచ్చారు. కానీ.. వరద ప్రభావిత గ్రామాలను సందర్శించ లేదు.
వరదకు కొట్టుకుపోయిన పంటలు, తెగిన కల్వర్టులు, దెబ్బతిన్న రహదారులను పరిశీలించలేదు. మంత్రి వస్తున్నారని, ఏదో మేలు జరుగుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. వరద నష్టాలపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్‌తో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా వరద నష్టంపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా కేవలం 20 నిమిషాల్లో సమీక్షను ముగించారు.
భారీ నష్టం..
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. ఒక్క దహెగాం మండలంలోనే ఇట్యాల, బిబ్రా, పం బాపూర్, లగ్గాం, దహెగాం, ఒడ్డుగూడా, అమరగొండ, గెర్రె, కర్గి, మొట్లగూడా, రాంపూర్, దిగిడ గ్రామాల పరిధిలో సు మారు 5 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
పెంచికల్పేట్ మండలంలోని కమ్మరగాం, మురిళిగూడా, జిల్లెడ, నందిగామ, వడ్డెపల్లి, అగర్గూడా గ్రామాలతోపాటు ప్రాణహిత, వా ర్ధా నదుల బ్యాక్ వాటర్‌తో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా ప్రాణహిత, వార్ధా పరివాహక ప్రాం తాలైన బెజ్జూర్, సిర్పూర్(టీ), కౌటాల, చింతలమానేపల్లి మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి దెబ్బతిన్నాయి. కానీ.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలు, రహదారుల ప్రాంతాల్లో కొనసాగకపోవడం విశేషం.
మళ్లీ నివేదికలు తయారు చేయండి..
ఇటీవల కురిసిన వర్షం కారణంగా పంటలకు అపారనష్టం కలిగింది. సుమారు 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. బుధవారం నిర్వహించిన మంత్రి సమీక్షలో 6,453 ఎకరాల్లో పంటలు, 47 పశువులు, 23 ఆర్అండ్బీ రోడ్లు, ఇంకా కొన్ని చోట్ల పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖలకు చెందిన ఎనిమిది రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. నివేదికను పరిశీలించిన మంత్రి పంటల నష్టంపై మరోసారి తయారు చేసి అందించాలని ఆదేశించారు. పంటలకు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని, పశువులు కోల్పోయిన వారికి నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు.