ఆదిలాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : సాగులో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు రుణాల మంజూరు, రుణ పరిమితి విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1.47 లక్షల మంది పట్టా పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. వీరు సాగు కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. వివిధ బ్యాంకులకు చెందిన 25 బ్రాంచ్‌ల ద్వారా రైతులకు వానకాలం, యాసంగిలో రుణాలు ఇస్తారు.
ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందు రుణాల పంపిణీలో భాగంగా బ్యాంకర్ల సమితి పంటలవారీగా సాగయ్యే ఖర్చులు, ఇతర పెట్టుబడులను అంచనా వేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఏ పంటలకు ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది. ఇటీవల బ్యాంకర్ల సమితి సమావేశమై రుణ పరిమితి వివరాలను వెల్లడించింది. గతేడాది పోలిస్తే పంటలవారీగా కొన్నింటికీ మాత్రమే స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్ల నిర్ణయంపై రైతు సంఘాలు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏటా వానకాలంలో రైతు లు 5.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. పెట్టుబడి కోసం బ్యాంకు రుణాలు తీసుకోవడంతోపాటు ప్రైవేటు అప్పులు చేస్తారు. ఏ టా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రైతులపై పెట్టుబడి భారం పెరుగుతుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోకపోవడంతో రైతులు ప్రైవేటు అ ప్పులు చేసి నష్టపోవాల్సి వస్తుంది. బ్యాంకర్ల సమితి వర్షాధార, నీటి ఆధారంగా చేసే పంటలకు వేర్వేరుగా రుణ పరిమితిని నిర్ణయిస్తారు. జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయా, కంది, జొన్న, శనగ సాగు చేస్తారు. ఈ ఏడాది ఎకరా పత్తి సాగు కు రూ.2 వేలు పెంచారు. సోయా, జొన్న పంటలకు రుణాలను పెంచలేదు. కందులు శనగ, పెసర పంటలకు స్వల్పంగా పెంచారు. బ్యాంకు పెంచిన రుణాలు సాగుకు సరిపోవని రుణ పరిమితిని ఇంకా పెంచాలని రైతులు కోరుతున్నారు.
నాకు మూడెకరాల భూమి ఉంది. రామాయి దక్కన్ గ్రామీణ బ్యాంకులో నేను పంట రుణం తీసుకుంటా. పెట్టుబడులు ఏటా పెరుగుతున్న బ్యాంకు రుణాలు మాత్రం పెరగడం లేదు. ఈ సారి పత్తి ప్యాకెట్ ధర రూ.47 పెరిగింది. ఎరువులు, మందుల ధరలు పెరిగాయి. పత్తి ఏరడానికి కూలీలు కిలోకు రూ.10 తీసుకుంటున్నారు. వేరే ఖర్చులు కూడా ఉంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాలు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ అప్పులు తీసుకుని ఎక్కువ వడ్డీతో రైతులు నష్టపోతున్నాం. బ్యాంకర్లు రుణ పరిమితి పెంచాలి.
– చుక్కబొట్ల రవి, యాపల్‌గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం
ఏటా సాగు పెట్టుబడులు పెరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలను ఇవ్వడం లేదు. దీంతో రైతులపై భారం పడుతుంది. ఎరువులు, పురుగుల మందులు, కలుపుతీత కూలీలు, పంట తీసే కూలీల రేట్లు పెరిగాయి. బ్యాంకర్లు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రుణపరిమితి నిర్ణయించాలి. కొన్ని పంటలకు గతేడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. బ్యాంకర్ల నిర్ణయాలు రైతులకు అనుకూలంగా ఉండాలి.
– బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు