నిర్మల్ అర్బన్, జూన్ 4 : నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించిన ఐదుగురిని గుర్తించామని తెలిపారు. వీరి ఖాతాల ద్వారా రూ.8.08 కోట్లకు పైగా లాదాదేవీలు జరిగాయన్నారు.
లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మగ్గిడి మహేందర్.. సోన్ మండలంలోని మాదాపూర్‌కు చెందిన మేకల నిఖిల్, షికారి, సాయి కృష్ణలు 2024 సంవత్సరం నుంచి తమ పేర్లతోపాటు వ్యాపార సంస్థల పేర్లపై వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభి వాటికి సంబందించిన ఏటీఎం కార్డులు, ఇతర బ్యాంకు వివరాలను సైబర్ నేరగాళ్లకు అందజేశారు. అమాయకులను ఆన్లైన్ మోసాలకు గురి చేసి డబ్బులను ఈ ఖాతాల ద్వారా స్వీకరించారు.
అనంతరం ఇతర ఖాతాలకు బదిలీ చేస్తూ నేరగాళ్లు డబ్బు జాడను దాచిపెట్టేవారు. ఇందుకు ప్రతిఫలంగా ఖాతాదారులు కమీషన్ పొందారని విచారణలో తేలిందన్నారు. లోకేశ్వరం మండలానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చామన్నారు. సోన్ మండలానికి చెందిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిపై లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు రవీందర్, గోవర్ధన్‌రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.