నిర్మల్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలవారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో 7,47,644 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,59,393 మంది, మహిళా ఓటర్లు 3,87,227 మంది ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు 52 మంది, సర్వీస్ ఓటర్లు 972 మంది ఉన్నారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో 925 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
కాగా.. గత శాసనసభ ఎన్నికల నాటితో పోలిస్తే ఈ సంవత్సరకాలంలో 24 వేలకు పైగా కొత్త ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లతోపాటు కొత్తగా నమోదు చేసుకున్న వారిలో మహిళలదే పైచేయిగా కనిపిస్తున్నది. కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారిలో యువత కొంతమేర వెనుకంజలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నవంబర్ 2023లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా, అప్పట్లో జిల్లాలో 7,23,389 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ప్రకటించిన తుది జాబితాలో 7,47,644 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ లెక్కన జిల్లాలో కొత్తగా 24,255 మంది ఓటర్లు పెరగడం గమనార్హం. ఏడాది కింద మహిళలు 3,72,829 మంది ఉండగా, తాజాగా వీరి సంఖ్య 3,87,227కి పెరిగింది. అంటే కొత్తగా 14,398 మంది కొత్త మహిళా ఓటర్లు పెరిగారు. జనాభా పరంగా ఆధిక్యంలో ఉన్న మహిళలు ఓటరుగా నమోదులోనూ అదే వరుసలో నిలుస్తున్నారు. అయితే పురుష ఓటర్ల సంఖ్యలో మాత్రం పెద్దగా తేడాలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 3,50,509 మంది పురుష ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 3,59,393కి చేరింది. అంటే ఈ ఏడాది కాలంలో 8,884 మంది మాత్రమే పెరిగారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా.. సెల్‌ఫోన్‌తో గడిపే యువత కనీసం ఆన్లైన్లో నైనా తమ ఓటును నమోదు చేసుకోకపోవడం శోచనీయం. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయవర్గాలు ఓటర్ల జాబితాను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.