దండేపల్లి, అక్టోబర్ 7 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని కాకో ఆలయం వద్ద మంగళవారం దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆదివాసీ గిరిజన మందిరాన్ని దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచేగాక మహారాష్ట్ర, కిన్వట్, ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ర్టాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.
యేటా దసరా పండుగ అనంతరం వచ్చే పౌర్ణమి నుంచి ఆరంభమయ్యే దండారీ ఉత్సవాలు దీపావళి అమవాస్య వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. రేలా…రేలా… అంటూ సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. అమ్మవారికి నిష్టతో పూజలు చేస్తే ఐష్టెశ్యర్యాలు, సుఖశాంతులు కలిగి, పాడిపంటలు బాగా పండుతాయని గిరిజనులు బలంగా విశ్వసిస్తారు.
ఉత్సవాల్లో భా గంగా పద్మల్పురి కాకోకు మహిళలు దంచిన బియ్యంతో తయారు చేసిన అరిసెలు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అనంతరం మేక లు, కోళ్లు బలిచ్చి ఆలయం సమీపంలో వంట లు చేసుకొని సామూహిక భోజనాలు చేస్తారు. కొత్తగా పెండ్లయిన జంటలు అమ్మవారి ముందు భేటీ(కొత్త కోడళ్ల పరిచయం) కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో గోదావరి తీరం జనసంద్రంగా మారనున్నది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, నదీ జలాలతో అమ్మ వారికి మొక్కులు చెల్లించుకుంటారు.
సౌకర్యాల కల్పనలో విఫలం
సంబురాలకు ముందుగానే సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, పాలకులు మిన్నకుండిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వెళ్లే మట్టి రోడ్డు బురదమయంగా మారడంతో కనీసం కాలినడకకు కూడా వీలులేకుండా పోయింది. వ్యాన్లు, ట్రాక్టర్లు, కార్లలో వచ్చే భక్తులు ఆలయానికి చేరుకోలేని దుస్థితి ఉంది.
ఇక లింగాపూర్ నుంచి గుడిరేవు బీటీ రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయ ఆవరణ కూడా చిత్తడిగా తయారైంది. రోడ్డును బాగు చేసి కరెంటు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఆలయ చైర్మన్ కుడిమెత సోము భక్తులు కోరుతున్నారు. కాగా, పద్మల్పురి కాకో ఆలయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.36 లక్షలు మంజూరు చేసి, ఆలయ అభివృద్ధికి కృషి చేసింది.