హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే వినూత్న తరహాలో బీఆర్ఎస్ తరుపున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలదరూ తమతమ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి, బస్‌భవన్‌కు చేరుకుంటారని వివరించారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు చార్జీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి.. ఒక చేతితో పెట్టి ఇంకో చేతితో లాక్కున్నట్టుగా ఉన్నదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పేరుతో మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అంటూనే, మరోవైపు అదే మహిళల కుటుంబసభ్యులైన పురుషుల నుంచి అధిక మొత్తంలో బస్సు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఒకేసారి రూ.10 చొప్పున టికెట్ చార్జీలు పెంచిన దాఖలాలు లేవని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులపై చార్జీల భారం పడుతున్నదని, జీవనోపాధికి దూరప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కుట్రలు చేస్తున్నదని తలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే గౌలిగూడ బస్టాండ్‌ను ప్రైవేటువారికి అప్పగించారని, కొన్ని డిపోలు, ఖాళీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారని, విద్యుత్తు బస్సు డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో రెగ్యులర్ డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగాల ఉనికికే ప్రమాదం పొంచిఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆర్టీసీ కార్మిక సంఘం తక్షణమే మేల్కొనకపోతే, ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
ఈ నెల 9న నిర్వహించనున్న చలో బస్‌భవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తమ తమ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులోనే తరలివస్తారని తలసాని వివరించారు. కేటీఆర్ స్వయంగా నందినగర్ నుంచి బస్సులో ప్రయాణం చేసి బస్‌భవన్‌కు చేరుకుంటారని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మెహిదీపట్నం నుంచి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సికింద్రాబాద్ నుంచి, సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం నంచి, పద్మారావుగౌడ్ చిలకలగూడ నుంచి, ముఠాగోపాల్ ముషీరాబాద్ నుంచి, లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి, మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి, మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నుంచి, కాలేరు వెంకటేశ్ అంబర్‌పేట నుంచి, సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి బస్‌భవన్‌కు చేరుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా తోటి ప్రయాణికుల సాధక బాధకాలను తెలుసుకుంటారని, ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. బస్సు చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.