వికారాబాద్ నియోజకవర్గంలోని చిట్టిగిద్ద గ్రామంలో మంగళవారం ట్రిపుల్ఆర్ బాధితులు ఏర్పా టు చేసిన ‘రైతు గోస’ కార్యక్రమానికి మాజీ మంత్రి సబిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, నేతలు హాజరయ్యారు. రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ సర్కారు అణచివేత ధోరణిని కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పారు.
వికారాబాద్/నవాబుపేట, అక్టోబర్ 7 : రైతుల భూములపైనే రేవంత్‌రెడ్డి డేగ కన్ను వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేందుకు బీఆర్ఎస్ ఎంతదూరమైనా వెళ్తుందని సర్కార్‌ను హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగాలంటే లగచర్ల మాదిరిగా మరో పోరాటం చేయక తప్పదని అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన ‘రైతు గోస’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా మండలాల ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను కలిసి మాట్లాడారు. వారిని ఓదార్చారు. అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని అన్నారు. రైతులకు నష్టం జరుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట, పూడూరు మండలాల ట్రిపుల్ ఆర్ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ట్రిపుల్ ఆర్‌పై స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్, మంత్రులు సైతం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు సైతం ఈ విషయమై స్పష్టత లేదని మండిపడ్డారు.
ట్రిపుల్ ఆర్‌పై ఎలాంటి సందేహాలు ఉన్నా హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చి చెప్పాలని అంటున్నారని, కానీ రైతులు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను పోలీసులు పట్టుకుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు వారికి ధైర్యం చెప్పలేదని ప్రశ్నించారు. బాధిత రైతులు జేఏసీగా ఏర్పడి ప్రణాళికాబద్ధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులందరితో కలిసి వచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు. పాత అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని సర్కార్‌ను ప్రశ్నించారు. కొత్త అలైన్మెంట్ వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో రైతులకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
ట్రిపుల్ ఆర్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఎమ్మెల్యే, స్పీకర్, మంత్రులు సైతం స్పందించక పోవడం బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ట్రిపుల్ ఆర్ పనులు జరుగుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయమై ఎమ్మెల్యే, స్పీకర్ ఇండ్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్‌లో పెద్ద రైతులు భూములు పోవడం లేదని అన్నారు. ఇందులో కేవలం సన్న, చిన్న కారు రైతులే బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.