కాంగ్రెస్ 22 నెలల పాలనలో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు కదా.. ఉన్న రోడ్లను కూడా మెయింటెనెన్స్ చేయలే. ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలే. ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నరు. అన్ని వర్గాలవారిలో ఈ కోపం స్పష్టంగా కనిపిస్తున్నది. వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తప్పకుండా బుద్ధి చెప్తరు.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడమే రేవంత్‌రెడ్డి ఇన్నోవేటివ్ థింకింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రేవంత్‌రెడ్డి ఎప్పడూ చెప్పే ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటి? భార్యకు ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకు డబుల్ రేటు, పిల్లల బస్‌పాస్‌ల చార్జీలు పెంచడం. అంటే అల్టిమేట్‌గా ఒకొక కుటుంబం మీద గతం కంటే 20 శాతం ఎకువ భారం మోపడం.. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్’ అని దుయ్యబట్టారు. పనిలోపనిగా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘ఇవాళ ఈవీ బస్సుల పేరిట మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారు.
ఈవీ బస్సులను కార్పొరేషన్ నేరుగా ఎందుకు కొనకూడదు? ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు?’ అని ప్రశ్నించారు. ‘ఒకవైపు ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర పన్నుతూనే, మధ్య తరగతి కుటుంబాల జేబులు కొల్లగొట్టడానికి చార్జీలు పెంచారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఆర్టీసీ చార్జీలు పెంచారు. బయట పెంచలేదు. ఎందుకంటే వారికి తెలుసు హైదరాబాద్‌లో ఒక సీటు కూడా కాంగ్రెస్‌కు రాలేదు. మళ్లీ భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి ఆ కోపం ప్రజల మీద తీయడానికి ఒక్కో టికెట్ మీద 10 రూపాయలు పెంచారు. ఇది చాలా దుర్మార్గం’ అని మండిపడ్డారు. పండుగకు ఊరికి పోదామంటే టికెట్ మీద 50 శాతానికిపైగా ప్రత్యేక చార్జీల పేరిట వసూలు చేస్తున్నారని విమర్శించారు. ‘కేసీఆర్ హయాంలో పండుగకు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇవ్వాల పరిస్థితి ఏంది? రేవంత్‌రెడ్డి బస్‌చార్జీలు 50 శాతం పెంచి గిఫ్ట్‌లు ఇస్తున్నారు’ అని ఎద్దేవాచేశారు. ముమ్మాటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజల కోపం వచ్చే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని, దాన్ని తప్పకుండా కాంగ్రెస్ అనుభవిస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల కడుపుకొట్టిందని, పాలన అంతా మోసాలమయంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. 22 నెలల్లో ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ఏ మొఖం పెట్టుకొని ఆ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలా ఫలితాలు వస్తే, హైదరాబాద్‌లో మాత్రం ఒక సీటు కూడా కాంగ్రెస్‌కు ఇవ్వకుండా అన్ని స్థానాలను ప్రజలు బీఆర్ఎస్కే కట్టబెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు 22 నెలల్లో కాంగ్రెస్ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని స్పష్టంచేశారు.
మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా తమ కడుపు మీద కొట్టిందో చెప్తారని వివరించారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హైదరాబాద్‌లో ఉండే నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామన్నారని, ఏ ఒక వాగ్దానం కూడా అమలు చేయకుండా ఓట్లు అడుగుతున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేసే అన్ని మోసపూరిత ప్రయత్నాలు విఫలమవుతాయని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మళ్లీ తమ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ మంచి మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు.
జూబ్లీహిల్స్‌లో శ్మశాన వాటిక విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తామేదో శ్మశానవాటికి తెచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. కానీ, 125 ఎకరాలను ముస్లింలు, 125 ఎకరాలు క్రైస్తవుల శ్మశాన వాటికల కోసం 2022లోనే కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. ఇవాళ 2,500 గజాలు ఇచ్చామని చెప్పకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో స్థలాలు లేవని, అయనా కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు 125 ఎకరాలను కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చిందని వివరించారు. నిన్న కాంగ్రెస్ నేతలు కొత్త మోసానికి తెరలేపారని, 2,500 గజాల స్థలం ఇచ్చాం.. పండుగ చేసుకోండి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. తీరా అక్కడకు వెళ్తే ఆర్మీ వాళ్లు వచ్చి ‘ఇది మా స్థలం, మీరు వెళ్లిపోండి’ అని వెళ్లగొట్టారని తెలిపారు. ఈ రకమైన మోసాలు కాంగ్రెస్ చేస్తూనే ఉంటుందని, ప్రజలు తిప్పి కొడుతూనే ఉంటారని హెచ్చరించారు.
జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల అస్తిత్వం కోసం, ప్రజల హకుల కోసం పోరాడిన యోధుడు, గోండు బెబ్బులి కుమ్రం భీం అని కేటీఆర్ కొనియాడారు. ఆయన ఇచ్చిన పోరాట స్ఫూర్తే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్‌లో సుందరమైన సృ్మతి వనాన్ని ఏర్పాటు చేసినందుకు, హైదరాబాద్ మహానగరంలో కుమ్రంభీం పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నాం’ అని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విప్లవ వీరుడు కుమ్రంభీం వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు.