సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి… దీంతో దొంగలకు పండుగలా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్ ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉండేవారు. 2014లో తెలంగాణ ఏర్పడి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చి, దొంగతనాలపై ఉక్కుపాదం మోపారు.
ఇలా దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్‌లకు తావు లేకుండా చేయడంలో పోలీసులు సత్ఫలితాలు సాధించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం తగ్గిపోయింది. దీంతో అంతరాష్ట్ర ముఠాలు, పాత దొంగలు తిరిగి తమ చేతివాటం ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇటీవల బంగారం ధరలు భగ్గుమంటుండడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. నగరంతోపాటు శివారుల్లో దొంగతనాలు పెరుగుతున్నాయి.
చందానగర్‌లోని ఓల్డ్ ఎంఐటీ క్వార్టర్స్‌లో రిటైర్డు బీహెచ్ఎల్ ఉద్యోగి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత క్యాష్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు. దీనిపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.
పారామౌంట్ కాలనీలో నివాసముండే స్వప్న ఇంటి తాళాలు పలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు 43 తులాల బంగారు ఆభరణాలు, కొంత క్యాష్‌ను అపహరించడంతో ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రెండు నెలల క్రితం కుషాయిగూడలోని హెచ్‌బీ కాలనీలో నివాసముండే ఒక వ్యాపారి ఇంటికి తాళం వేసి సౌత్ ఇండియా టూర్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు ఎత్తుకుపోయారు. కుషాగూడ ఠాణాలో కేసు నమోదైంది.
అంతంత మాత్రంగా పెట్రోలింగ్
పెట్రోలింగ్ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉంటే నేరాలను కట్టడి చేసేందుకు అవకాశముంటుంది. అయితే పెట్రోలింగ్ వ్యవస్థ నేడు నిద్రావస్థలోకి జారుకోవడం ఆందోళన కల్గిస్తోంది. తరుచూ పెట్రోలింగ్ సిబ్బందితో స్టేషన్, జోనల్ , కమిషనరేట్ స్థాయిలో పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చే పరిస్థితులు తగ్గిపోయాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.