మంచిర్యాల టౌన్, జూన్ 22 : మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులను వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని, విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
అధిక ఫీజుల నియంత్రణ కోసం కమిటీని వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు భావించడం జరుగుతుందన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు దగ్గుల మధు, అరుణ్, రిషి, నార్లవంశీ, నక్క తిరుపతి, సాజిద్, బెల్లం అరుణ్, కంపెల్లి శ్రీకాంత్, జిలకల మహేశ్, చంద్రకిరణ్, లక్ష్మీకాంత్, రాజేందర్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్దార్థి సుమంత్, వడ్డేపల్లి నితీశ్ పాల్గొన్నారు.