బోథ్, మే 1 : షార్ట్‌సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతుల వద్దకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెళ్లి శుక్రవారం పరామర్శించారు. పొచ్చెర గ్రామానికి చెందిన గొండ్ల స్వామికి చెందిన ఐదు ఎకరాల జొన్న పంటతోపాటు ఇరవై పైపులు పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. ఇదే గ్రామానికి చెందిన గొండ్ల వెంకటరమణకు చెందిన ఏడు ఎకరాల మక్క పంటతోపాటు యాభై పైపులు దగ్ధమయ్యాయి.
కంసాలి వెంకటి రెండు ఎకరాల జొన్న పంటతోపాటు ముప్పై పైపులు, యటకారి రమేశ్‌కు చెందిన 30 పైపులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇటీవల బోథ్‌కు చెందిన సింగం రమణకు చెందిన ఆరు ఎకరాల్లో పండించిన జొన్న పంట పూర్తిగా కాలిపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే పేరొన్నారు. నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలోని మక్కలను వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు, రైతులు ఉన్నారు.
బోథ్ మండలంలోని కౌఠ(బీ) గ్రామం పరిధిలోని సాకేర శివారులో యాసంగి కింద సాగు చేస్తున్న ముడుపు సతీశ్ రెడ్డికి చెందిన రెండెకరాల జొన్న పంట శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో దగ్ధమైంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద 11 కేవీ తీగలు తెగి ఎల్టీ లైన్‌పై పడడంతో మంటలు చెలరేగాయని, చేతికి అందిన పంటతో పాటు 20 స్పింక్లర్ పైపులు, సోలర్ సెట్ అగ్ని దగ్ధమై రూ.1.50 లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వాపోయాడు.
బజార్హత్నూర్, మే 1 : మండలంలోని భూతాయి(బీ) గ్రామానికి చెందిన కాల్బుర్గే మారుతి రెండెకరాల మక్క పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
పెంబి, మే 1: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ ఘాతంతో 10 ఎకరాలు దగ్ధమైన ఘటన మరవకముందే శుక్రవారం ప్రమాదం జరిగింది. పోచంపల్లి గ్రామంలో మేగవాత్ లలితాబాయికి చెందిన 1.30 ఎకరాల మక్క పంట దగ్ధమైంది. సమీపంలోని రైతులందరూ మంటలను అదుపు చేశారు. విద్యుత్ తీగలతో షార్ట్‌సర్క్యూట్ జరిగి పంట దగ్ధమైందని బాధిత రైతులు తెలిపారు. పంట నష్టపరిహారం అందించాలని బాధితులు కోరారు.
కుంటాల, మే 1 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అందకూర్ గ్రామ శివారులో వదులుగా ఉన్న 11 కేవీ వైర్లు తెగిపడి షార్ట్‌సర్క్యూట్‌తో రెండు ఎకరాల జొన్న పంట కాలిపోయిందని, అధికారులు సర్వే చేసి బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తాత్రి డిమాండ్ చేశారు. శుక్రవారం దగ్ధమైన పంటను పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ ప్రవళిక ప్రశాంత్, మాజీ సర్పంచ్ కిషన్, మాజీ ఉప సర్పంచ్ వినోద్, రైతులు వెంకటేశ్, మల్లే ఉన్నారు.