ఆదిలాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) ః ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘సోయా కొనుగోళ్లు ఏమాయే’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ మార్కెట్ యార్డు గేటు తీయకపోవడంతో వాహనాల్లో సోయా పంటను విక్రయించడానికి వచ్చిన రైతులు బయట నిరీక్షించాల్సి వచ్చింది. రైతుల ఇబ్బందులను ‘నమస్తే’ ఫొటోలతో ప్రచురించింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు సిబ్బంది మంగళవారం ఉదయమే గేటు తీయగానే రైతులు భారీగా పంటను విక్రయానికి తీసుకొచ్చారు. దీంతో యార్డులోని షెడ్డు సోయాబిన్ కుప్పలతో నిండిపోయింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతుండగా.. సహకార సంఘాల ద్వారా సేకరిస్తున్నారు. సహకార సంఘం సిబ్బంది నాణ్యతతోపాటు తేమ శాతాన్ని పరిశీలించారు. చెత్తాచెదారం ఉన్న సోయాను జల్లెడ పట్టాలని సూచించారు. 50 కిలోల గన్నీ బ్యాగులు తీసుకొచ్చి నిబంధనల మేరకు తేమ ఉన్న పంటను కాంటా చేశారు. కొనుగోళ్లు ప్రారంభంకావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.