మంచిర్యాల, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘చెన్నూర్ నియోజకవర్గంలో నీళ్లు సరిగా లేవు. పంటలు ఎండిపోతున్నాయి. రెండు టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి చెన్నూర్ నియోజకవర్గానికి విడుదల చేయాలి’ అని మంత్రిని రిక్వెస్ట్ చేశానంటూ చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి గోదావరి పక్కనే ఉన్నా చెన్నూర్ నియోజకవర్గంలో గోదావరి నీటిపై ఆధారపడి పంటలు సాగు చేయరు.
గోదావరి నీరు ఉంటే మోటార్లు పెట్టి తోడుకోవడం తప్ప పంటలకు నీళ్లు ఇచ్చే ప్రత్యేక కెనాల్ సిస్టమ్ ఏమీ లేదు. బీఆర్ఎస్ హయాంలో గోదావరి నిండుకుండలా ఉంటే ఈ నీటిని మోటార్లతో తీసుకోవడానికి అవకాశం ఉండేది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి బోర్ల కింద పంటలు పండించే వీలుండేది. కానీ ఇప్పుడు గోదావరిలో నీళ్లు లేవు. కాళేశ్వరం పిల్లర్ బాగు చేయలేక కహానీలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఆ సాకును చూపి అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను నింపడం లేదు. దీంతో చెన్నూర్ నియోజకవర్గంలో ఒకప్పుడు నీటితో కళకళలాడిన గోదావరి, ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయింది.
ఒక వేళ ఎమ్మెల్యే కోరికపై ఎల్లంపల్లి నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినా ఎండిపోయి ఉన్న గోదావరి గొంతు తడపడానికే సరిపోతాయి. ఆ నీరు పంట పొలాలకు వస్తుందన్న గ్యారెంటీ లేదు. గోదావరిలో నీరు లేక జైపూర్ మండలంతో పాటు చెన్నూర్ రూరల్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలకు నీరు సరిపోవడం లేదు. బోర్లతోనైనా సాగు చేద్దామంటే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది.
ఈ విషయంలో రైతులు ఇప్పటికే దిగులుపడుతుంటే ‘గోరుచుట్టుపై రోకలిపోటు’ అన్న చందంగా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు కావాల్సింది గోదావరిలో నీళ్లు కాదు.. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తి చేయడం’ అని కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికైనా దీనిపై ఎమ్మెల్యే దృష్టి సారిస్తే మంచిదంటూ పెదవి విరుస్తున్నారు.
చెన్నూర్ లిఫ్ట్‌తోనే నీటి కష్టాలకు మోక్షం
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రూ.1658 కోట్లతో మూడు లిఫ్టుల ద్వారా చెన్నూర్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి గత ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలో శంకుస్థాపన చేశారు. లిఫ్ట్-1 కింద జైపూర్ మండలం శెట్పల్లిలో నిర్మించే పంప్‌హౌస్ ద్వారా పొన్నారం, శంకరపల్లి, గంగపల్లి చెరువులను నింపుతూ 43.35 కిలోమీట్లర కాలువ నిర్మించాలనేది ప్రతిపాదన.
దీంతో జైపూర్ మండలంలోని 21 గ్రామాలతో పాటు మంద్రమర్రిలోని 6 గ్రామాలకు మొత్తంగా 27 గ్రామాల్లోని 25,422 ఎకరాలు సాగునీరు అందేది. లిఫ్ట్-2 కింద అన్నారం సరస్వతీ బ్యారేజ్ నుంచి చెన్నూర్ సోమన్‌పల్లిలో పంప్‌హౌస్ ద్వారా ఆరేపల్లి, ఆస్నాద్, రెడ్డిపల్లి చెరువులను నింపుతూ 63.30 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించాలి. తద్వారా చెన్నూర్ మండలంలోని 13 గ్రామాలు, కోటపల్లి మండలంలోని 9 గ్రామాలు మొత్తంగా 52 గ్రామాల్లోని 48,208 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
లిఫ్ట్-3 కింద మేడిగడ్డ ప్రాణహిత నదిపై నిర్మించే లక్ష్మీబ్యారేజ్ నుంచి కోటపల్లి మండలం ఆల్గంలో నిర్మించే పంప్‌హౌస్‌తో శంకరాపూర్, ఆయపల్లి చెరువులను నింపుతూ 35.55 కిలోమీటర్ల ప్రధాన కాలువలు నిర్మించాలి. దీని కింద కోటపల్లి మండలంలోని 24 గ్రామాల్లో 16,370 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంటే దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర అవకాశం చెన్నూర్ లిఫ్ట్‌తో ఉంటుంది.
గతంలో ప్రతిష్టాత్మకం..ఇప్పుడు పట్టింపులేని తనం..
గతంలో బాల్క సుమన్ ప్రభుత్వ విప్‌గా, చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చారు. రోడ్లు లేని పల్లెలకు రోడ్లు వేయించారు. వాగులు, వంకలపై బ్రిడ్జిలు నిర్మించారు. ఇక రైతుల కోసం ఏమైనా చేయాలని పట్టుబట్టారు. ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు చేసి చెన్నూర్ నియోజకవర్గ నీటిగోస తీర్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కిమ్‌కు అంకురార్పణ చేశారు. తన ఆలోచన సీఎం కేసీఆర్‌తో చెప్పి సర్వే కోసం రూ.8.88 కోట్లు మంజూరు చేయించారు.
2020 జూన్ ఒకటిన సర్వే పనులను ప్రారంభించి, నిర్దేశించిన గడువులోపు సర్వే పనులను పూర్తిచేయించారు. ఆ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించి 2022 ఏప్రిల్ 12న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.1658 కోట్ల చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కిమ్‌కు మంజూరు చేయించేందుకు ఒప్పించారు. ఈ మేరకు 2023 జూన్ 9న మంచిర్యాలకు వచ్చిన సీఎం కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించారు. ఈ లోగా ఎన్నికలు వచ్చాయి. చెన్నూర్‌లో హస్తం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వివేక్ గెలిచారు. అప్పటి వరకు చకచకా సాగిన చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాక పట్టించుకునే నాథుడే లేక మరుగున పడ్డాయి.
చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పక్కనపెట్టి.. గోదావరికి ఆ వైపున ఉన్న మంథని నియోజకవర్గంలో రూ.571.57 కోట్ల చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇంత జరుగుతున్నా సర్వే పూరై, శంకుస్థాపన చేసిన చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వకుండా చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇస్తుంటే ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు. పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం నిధులు ఇస్తుండే మా ప్రాంతానికి ఎందుకు ఇవ్వరు ? అని అడగకుండా గోదావరి నీళ్లు విడుదల చేయాలని కోరడం ఏమిటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలోని పంట పొలాలను సస్యశామలం చేసే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయిందని, ఆ ప్రతిపాదనలు పరిశీలించి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సార్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఎల్లంపల్లి నీరు వదిలినా ప్రయోజనం లేదు
ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల ద్వారా చెన్నూర్ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. అసెంబ్లీలో చెన్నూర్ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. సుందిళ్ల ప్రాజెక్టులో నీటిని నింపడంతో ప్రయోజనం ఉంది. గత ప్రభుత్వం హయాంలో జైపూర్ మండలంలోని శెట్పల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సర్వే పనులు సైతం పూర్తయి, పనులు మొదలయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. ఎమ్మెల్యే వివేక్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై దృష్టి ఉంచి పనులు ప్రారంభిస్తే నియోజకవర్గంలోని 102 గ్రామాలకు సాగు నీరు అంది, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అలా కాకుండా ఎల్లంపల్లి నుంచి రెండు టీఎంసీలు వదిలితే చెన్నూర్ రైతులకు వచ్చే లాభం ఏమీలేదు.
– మేడి సునీత, రైతు జైపూర్
ప్రాజెక్టు పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలి
గోదావరిలో నీళ్లు వదిలితే మాకు వచ్చేది ఏం ఉండదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. గోదావరిలో నీళ్లు వదిలితే ఏ కాలువలతో పొలాల్లోకి నీరు వస్తాయి. రెండు టీఎంసీల నీరు మొత్తం ఎండిపోయిన గోదావరిని తడపడానికే సరిపోతది. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తెస్తేనే చెన్నూర్ సస్యశామలం అవుతది. దానికి కావాల్సిన నిధులు తెవడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. అప్పుడు గానీ రైతుల ఇబ్బందులు తీరవు.
– చల్లూరి బాపు, రైతు ధర్నారం గ్రామం, భీమారం మండలం