 
                                                            ఆదిలాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 చొప్పున కొనుగోలు చేయడానికి సీసీఐ ఏ, బీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకొని వాహనాల్లో పత్తిని నింపుకొని తీసుకొచ్చారు.
మద్దతు ధరతో పత్తిని అమ్ముకోవాలంటే 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉండాలనే నిబంధన ఉండడంతో కొద్ది మందికే మద్దతు ధర లభించింది. నాలుగు రోజులుగా నిరీక్షిస్తుండడం, తేమ శాతం కారణంగా సీసీఐకి విక్రయించుకొనే అవకాశం లేకపోవడం, ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.1200 తక్కువతో కొనుగోలు చేస్తుండడంతో పత్తిని ఇంటికి తీసుకెళ్లలేక మార్కెట్ యార్డులోనే ఆరబెడుతున్నారు. సోమవారం నుంచి పంటను ఆరబెడుతున్నా అధికారులు తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోళ్లు చేయడం లేదు. తిండి, తిప్పలు లేక రాత్రి, పగలు పంటకు కాపలా కాస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇటు వైపు వచ్చి చూడడం లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ విషయంలో అధికారులు సానుకూల ధృక్పథంతో వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు. వర్షాల కారణంగా గురువారం రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకురాకపోవడంతో కాంటాలు ఖాళీగా కనిపించాయి.
మా గోస పట్టించుకునేటోళ్లు లేరు..
సీసీఐకి పత్తిని అమ్ముదామని సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు 25 క్వింటాళ్లు తీసుకొచ్చిన. తేమ 16 శాతం ఉందని అధికారులు కొనుగోలు చేయలేదు. ప్రైవేటుకు అమ్ముదామంటే క్వింటాలుకు రూ.1200 తక్కువ ధరతో కొంటున్నారు. ఇలా అయితే రూ.30 వేల వరకు నష్టపోతా. అందుకనే మార్కెట్ యార్డులోనే ఆరబెడుతున్నా. అధికారులు కనీసం స్పందించడం లేదు.
– నారాయణ, రైతు, కుచులాపూర్, తలమడుగు
 
                            