నిర్మల్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : రైతులు పెద్ద దిక్కను కోల్పోతే ఆ కుటుంబం ఆగం కావద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతు కూడా కాలం చేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆరేళ్లపాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో మరణించిన 3,742 మంది రైతు కుటుంబాలకు దాదాపు రూ.187 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం నీరుగారుతున్నది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల మరణించిన రైతు కుటుంబాలకు గత రెండు నెలలుగా బీమా డబ్బులు అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమాకు అవసరమైన ప్రీమియం డబ్బులు సకాలంలో ఇన్సూరెన్స్ సంస్థలకు చెల్లించకపోవడంతోనే బాధిత కుటుంబాలకు బీమా సాయం అందడంలో జాప్యం జరుగుతున్నదని సమాచారం.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతుబీమాకు అర్హత ఉండి, అకాల మరణం చెందిన 141 మంది రైతులు బీమా డబ్బుల కోసం వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో 49 మంది రైతులకు సంబంధించిన ధ్రువపత్రాలు ఏఈవోలు ఆన్లైన్లో నమోదు చేయలేదని చెబుతున్నారు. అలాగే మరో 16 మంది దరఖాస్తులు వ్యవసాయశాఖ నోడల్ అధికారి వద్ద పెండింగ్లో ఉన్నాయి.
కాగా అన్ని పత్రాలు సమర్పించిన 76 మంది రైతు కుటుంబాలకు రావాల్సిన బీమా డబ్బులు విడుదల చేయడంలో ఇన్సూరెన్స్ సంస్థ ఎందుకు జాప్యం చేస్తున్నదో తెలియడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుబీమా విషయంలో అధికారులకు సైతం స్పష్టత లేకపోతుండటం విమర్శలకు తావిస్తున్నది. గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటివరకు ఒక్కరికి కూడా రైతుబీమా సాయం అందలేదు.
మా భర్త బందెల ముత్యం ఆరోగ్యం బాగాలేక రెండు నెలల క్రితం కాలం చేసిండు. మార్చి 11వ తేదీన రైతుబీమా కోసం దరఖాస్తు చేసినం. దాదాపు 50 రోజులు దాటినా, ఇప్పటి వరకు బీమా డబ్బులు రూ.5 లక్షలు రాలేదు. ఆఫీసర్లను అడిగితే టైం పడుతుందని, వచ్చినప్పుడు చెబుతామని అంటున్నరు.
మా భర్త ఆరోగ్యం బాగు చేయించుకునేందుకు ఎకరంన్నర భూమిని అమ్మిన. హైదరాబాద్లోని పెద్దాసుపత్రిలో రూ.20 లక్షల వరకు ఖర్చైనయ్. అయినా ప్రాణం దక్కలేదు. 48 ఏళ్ల వయసులోనే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినం. 16 ఏళ్ల వయసులోపు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నరు. బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్న. ప్రభుత్వం రైతుబీమా సాయం ఇప్పించి ఆదుకోవాలి.
– బందెల లక్ష్మి, సంగంపేట్, సోన్ మండలం
