ఆదిలాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది 5.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 4.26 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో సోయా, 45 వేల ఎకరాల్లో కంది, 39 వేల ఎకరాల్లో మక్కతోపాటు 2350 ఎకరాల్లో ఇతర పంటలను వేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు వాతావరణం సాగుకు అనుకూలంగా ఉండడంతో పత్తి, సోయా బాగా పెరుగుతున్నాయి. దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులకు జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 20 రోజులుగా భారీ వర్షాలు కురవడం లేదు. కొన్ని మండలాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నా.. పంటలకు అవసరమైన సమయంలో నీరు అందకపోవడంతో ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని రైతులు వాపోతున్నారు.
ఎల్నినో ప్రభావం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తక్కువగా పడుతున్నాయి. సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు అవుతుండగా.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 738.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా శుక్రవారం వరకు 552.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కాత దశలో ఉన్న పంటలకు ప్రస్తుతం వర్షం అవసరం కాగా.. వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు నీరు అందిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం లేకపోగా వారు వర్షాలపై ఆధారపడి కేవలం వానకాలం పంటలు మాత్రమే వేస్తారు.
రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడితే పత్తి, సోయాబిన్ పంటల ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని, వానలు పడకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో పత్తి, సోయా పంటలకు ప్రస్తుతం నీటి తడులు అత్యవసరం. పూత, కాత దశలో ఉన్న సోయా దెబ్బతినే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షాలు లేక పత్తి పంట ఎదుగుదల ఆగిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. వర్షం పడకపోవడంతో సాగు నీటి వసతి ఉన్న రైతులు మోటర్లు స్టార్ట్ చేసి స్ప్రింక్లర్ల సహాయంతో నీటి తడులు అందిస్తున్నారు. ఆ సౌకర్యం లేని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. భోరజ్ మండలాల్లో మండలంలో చేలు బీళ్లుగా మారుతున్నాయి.