కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ) / సిర్పూర్(యు), జూన్ 15 : వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంట లు వేసే సమయం దాటిపోతున్నా, రాష్ట్ర సర్కారు రైతుభరోసాపై ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం.. కొత్తగా పంట రుణాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు ఉద్దెర తెచ్చుకుందామని వ్యాపారుల వద్దకు వెళ్తే.. ఇదే అదనుగా ధరలు పెంచేసి అమ్ముతున్నారంటూ వారు వాపోతున్నారు.
ఈ ఏడాది వర్షాకాలంలో 4,52,248 ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా పత్తి 3.40 లక్షల ఎకరాల్లో వేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వానకాలం సాగు పనుల్లో రైతాంగం నిమగ్నంకాగా, సర్కారు రైతుభరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది యాసంగికి సంబంధించిన డబ్బులే ఇంకా అందించలేదు. ఇక పంట రుణాలు తీసుకుందామనుకుంటే.. బ్యాంకర్లు పాత అప్పు తీరుస్తేగాని కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణామాఫీ చేస్తుందో లేదోనని రైతులు అయోమయంలో పడిపోతున్నారు. ఇటు రైతు భరోసా అందక.. అటు పంటరుణాలు పొందలేక అష్టకష్టాలు పడుతున్నారు.
రైతుభరోసా రాక.. రుణాలు దొరకక దిక్కులేని పరిస్థితుల్లో పంట పెట్టుబడి కోసం ఫర్టిలైజర్స్ వ్యాపారులను ఆశ్రయిస్తే.. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేసి ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో వారు చెప్పిన ధరకు తీసుకోవాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఇక రైతులు కోరిన విత్తనాలు కాకుండా ఏవేవో కంపెనీలకు చెందిన విత్తనాలు అందిస్తున్నారని, ఇదేమని అడిగితే తీసుకుంటే తీసుకోండి.. లేదంటే లేదని చెబుతున్నారని అన్నదాతలు పేర్కొంటున్నారు. మార్కెట్లో మంచి దిగుబడిని ఇచ్చే బ్రాండెడ్ విత్తనాలుగా పేరుగాంచిన తులసీ, కబడ్డీవంటి విత్తనాలు కావాలని అడిగితే వ్యాపారాలు వాటిని ఇవ్వడం లేదు. 10 ప్యాకెట్ల విత్తనాలు అడిగే, రైతుకు ఒక బ్రాండెడ్ విత్తనాల ప్యాకెట్లు మరో తొమ్మిది ప్యాకెట్లు ఇతర కంపెనీలకు చెందినవి అప్పగిస్తున్నారు.
వానకాలం పంటల సాగుకు డబ్బుల్లేకుంటైనయి. కాంగ్రెసోళ్లు ఇప్పటి దాకా రైతు భరోసా డబ్బులు ఇవ్వకపాయే. రుణమాఫీ చేయకపాయే. మళ్లా ఎనకటి కాలం వచ్చినైట్లెంది. డబ్బుల్లేక జైనూర్లోని ఫర్టిలైజర్ దుకాణానికి పోయిన. ఉద్దెర కింద 5 బ్యాగుల పత్తి విత్తనాలు తెచ్చుకున్న. డబ్బులుంటే కావాల్సిన విత్తనాలు కొనుక్కునే వాన్ని.. కానీ యజమాని ఇచ్చిన విత్తనాలు తెచ్చుకున్న. అవి ఏ కంపెనో కూడా నాకు తెల్వదు. ఉద్దెర కాబట్టి ఏ ధరకు అమ్మినా తీసుకోవాల్సి వస్తుంది.
కాంగ్రెస్ సర్కారోళ్లు ఇప్పటి దాకా రైతు భరోసా ఇయ్యలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక మస్తు తిప్పలపడుతున్నం. నేను మొన్న దుకాణానికి పోయి 10 పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉద్దెర తెచ్చుకున్న. ఏ విత్తనాలు ఇచ్చిన్రో కూడా తెల్వదు. వాళ్లు చెప్పిన ధరకే తెచ్చుకున్న. పంట చేతికొచ్చినంక డబ్బులు కడుతానని చెప్పిన. కేసీఆర్ సర్కారులో గిట్ల గోసపడలే.