కడెం : సదర్మాట్ (Sadarmat Water) ఆయకట్టు కింది రైతులకు సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఆయకట్టు కింది రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో ( Rastaroko) నిర్వహించారు. మండలంలోని లింగాపూర్, మల్లన్నపేట, ఎలగడప, దిల్దార్‌నగర్, మాసాయిపేట, నచ్చన్ఎల్లాపూర్, పెత్తార్పు, మద్దిపడగ, లక్ష్మీసాగర్, సారంగపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 300కు పైగా మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు .
రైతులు మాట్లాడుతూ జనవరి 2న అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించి, రైతులకు పంట చివరి వరకు సాగునీటిని అందిస్తామని, నిరభ్యతంరంగా పంటలు సాగు చేసుకోవాలని హామీ ఇవ్వడంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి పంటలు సాగు చేశామని అన్నారు.
వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేశాక, వారబంధి పద్ధతిన నీటిని అందిస్తామని అధికారులు వారబంధి పద్ధతిని అమలు చేశారు. వారబంధి పద్ధతిలోనైన పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న తమకు మీకు ఇచ్చిన గడువు ముగిసిందని, ఏప్రిల్ 9న కాలువను మూసివేస్తామన్న అధికారులు పది రోజుల ముందుగానే కాలువను మూసివేశారని వాపోయారు.
పంటలు చివరి దశలో ఉండగా, నీటి విడుదలను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నించారు. వరిసాగుకు ఇంకా దాదాపు మూడు నుంచి నాలుగు తడులు కావాల్సి ఉంటుందని, ఈ సమయంలో నీటి విడుదల నిలిపివేస్తే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు. మే 10వ తేదీ వరకు నీటిని అందించాలని, లేని పక్షంలో అందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు.
పరిస్థితి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను విరమించే ప్రయత్నం చేశారు. తహసీల్దార్, కలెక్టర్ ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని భీష్మించారు. కడెం ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ రైతులతో మాట్లాడి, సదర్మాట్ అయకట్టు అధికారులతో మాట్లాడారు.
రాస్తారోకో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్ వారితో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదని అనడంతో మీరు అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్ అయినప్పటికీ ఉట్నూర్కే పరిమితం అయ్యారని ఆరోపించారు. అధికారులతో మాట్లాడి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఫోన్ కట్ చేయడంతో కలెక్టర్ వచ్చే వరకు రాస్తారోకో చేస్తామని బైటాయించారు. చివరకు అధికారుల హామీతో రాస్తారోకో విరమించారు.