ఎదులాపురం, అక్టోబర్ 25 : గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొనుగోళ్లను ముహూర్తం సాకు చూపి ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఏళ్లుగా స్థానికంగా వస్తున్న పద్ధతిని విస్మరించడం సరికాదని.. ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు భయపడే కొనుగోళ్లను గుట్టు చప్పుడు కాకుండా ప్రారంభించారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ఎన్నికలు ముఖ్యమా? రైతులు ముఖ్యమా? అని ప్రశ్నించారు. కొన్ని మండలాల నుంచే రైతులను పిలిపించి కొనుగోళ్లను ప్రారంభించడం సరికాదన్నారు. ఇప్పటికైనా 27వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయా? లేదా? అని కలెక్టర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
కిసాన్ కపాస్ యాప్ ద్వారా ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తేమ శాతం నిబంధనలను సడలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మాజీ మారెట్ కమిటీ చైర్మన్లు యాసం నర్సింగ్ రావ్, మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు, పండ్ల శ్రీనివాస్, బట్టు సతీష్, ఉగ్గే విఠల్, సంతోష్ వినోద్ పాల్గొన్నారు.