ఆదిలాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎనిమిది శాతం తేమ ఉంటే మద్దతు ధర క్వింటాలుకు రూ.8110తో కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించారు. ఎనిమిది శాతం తర్వాత ఒక్కో శాతానికి రూ.81 తగ్గిస్తూ 12 శాతం వరకు మాత్రమే కొంటామని ప్రకటించారు. దీంతో చాలా మంది రైతులు మద్దతు ధర లభించకపోవడంతో రూ.1000 తక్కువకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు. సోమవారం 81 మంది రైతులు 1617 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించగా.. 335 మంది రైతులు 6573 క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు.
తేమ పేరిట పత్తిని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డుల్లోనే పంటను ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో పత్తి ఎండపెట్టిన తేమ శాతం తగ్గే అవకాశాలు లేకుండా పోయాయి. ప్రైవేటు వ్యాపారులు మంగళవారం క్వింటాలుకు రూ.6810 ప్రకటించగా.. రైతులు అమ్ముకోవడానికి ముందుకు రాలేదు. ఒక్క శాతం తేమ ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, దీంతో పంటను మార్కెట్ యార్డులో ఆరబెట్టుకుంటున్నామని రైతులు అంటున్నారు. రెండు రోజులుగా మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాల కారణంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించారు.
నేను 30 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మడానికి సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. 12 శాతం వరకు తేమ ఉన్నా కొంటున్న అధికారులు నా పంటలో 14 శాతం తేమ ఉండడంతో తీసుకునేందుకు నిరాకరించారు. ప్రైవేటులో తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా మార్కెట్ యార్డులోనే పంటను ఆరబెట్టా. మబ్బులు ఉండడంతో పంట ఎండ లేదు. రాత్రి పంటకు కాపలా ఉంటున్నా. రెండు రోజులుగా తిండి లేక పడిగాపులు కాస్తున్నా. ప్రైవేటుకు అమ్మితే రూ.35 వేలు నష్టం వస్తుంది. పంట ప్రారంభంలో సీసీఐ ఒకటి, రెండు శాతం తేమను మినహాయిస్తే రైతులకు ఇబ్బంది ఉండదు.
– రాజిరెడ్డి, రైతు, నిపాని, (భీంపూర్ మండలం)
నేను 30 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మడానికి తీసుకువచ్చా. పంటను ఎండపెట్టి తీసుకొచ్చినా తేమ ఉందని కొంటలేరు. వాతావరణం చల్లగా ఉండి తేమ కొద్దిగా ఎక్కువ ఉంటే రైతులు ఏమి చేయాలి. సోమవారం మార్కెట్కు వచ్చిన నాయకులు పంటను ఆరబెడితే కొంటుందని అన్నారు. రెండు రోజులుగా మార్కెట్ యార్డులో పంటను ఎండపెట్టినా ఎవరూ మా దిక్కు చూసేటోళ్లు లేరు. బుధవారం మార్కెట్ బంద్ అంటున్నారు. ఎద్దు, ఎవుసం ఇడిచిపెట్టి ఎన్ని రోజులు ఉండాలి.
– రాములు, రైతు, కుచులాపూర్, (తలమడుగు మండలం)