కడెం, ఏప్రిల్ 9 : సదర్మాట్ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన బాట పట్టారు. దాదాపు లింగాపూర్, మల్లన్నపేట, ఎలగడప, దిల్దార్‌నగర్, మాసాయిపేట, నచ్చన్ఎల్లాపూర్, పెత్తార్పు, మద్దిపడగ, లక్ష్మీసాగర్, సారంగాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 300కు పైగా రైతులు తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు.
ఈ రాస్తారోకోతో నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను ఆందోళన విరమింప జేసే ప్రయత్నం చేశారు. తహసీల్దార్ ప్రభాకర్, కలెక్టర్ అభిలాష అభినవ్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
తహసీల్దార్ ప్రభాకర్‌కు కడెం ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ రైతులతో, సదర్మాట్ ఆయకట్టు అధికారులతో మాట్లాడారు. అయితే రాస్తారోకో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రైతులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదని అన్నారు.
దీంతో మీరు అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్ అయినప్పటికీ ఉట్నూర్కే పరిమితం అయ్యారని, తమ గోడు విన్నవించుకునే వారమని రైతులు సమాధానం ఇచ్చారు. అధికారులతో మాట్లాడి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఫోన్ కట్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటామని కూర్చున్నారు.
దీంతో తహసీల్దార్ ప్రభాకర్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు గంట పాటు సాగిన రాస్తారోకో తహసీల్దార్ హామీతో విరమించారు. నీటి విడుదల విషయంలో జాప్యం చేస్తే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని, తహసీల్దార్ హామీతోనే విరమిస్తున్నామని చెప్పారు.
మే 10వ తేదీ వరకు నీటిని అందించాలి..
జనవరి 2వ తేదీన అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించారని రైతులు తెలిపారు. రైతులకు చివరి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని, నిరభ్యతంతరంగా సాగు చేసుకోవాలని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరీ సాగు చేశారని తెలిపారు.
అయితే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు వేశాక వారబందీ పద్ధతిన నీటిని అందిస్తామన్నారు. ఏప్రిల్ 9వ తేదీన కాలువను మూసివేస్తామన్న అధికారులు పది రోజుల ముందుగానే ముసివేశారని తెలిపారు. పంటలు చివరి దశలో ఉండగా, నీటి విడుదలను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు దాదాపు మూడు నుంచి నాలుగు తడులు కావాల్సి ఉంటుందని, ఈ సమయంలో నీటి విడుదల నిలిపివేస్తే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. మే 10వ తేదీ వరకు నీటిని అందించాలని, లేకపోతే 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి ఉందని వాపోయారు.
నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తాం..
సదర్మాట్ ఆయకట్టు చివరి భూములకు నీటిని విడుదల చేయకపోతే అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తాం. అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే సాగు చేసినం. పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని విడుదల నిలిపివేస్తే మా పరిస్థితి ఏంటీ? స్వయంగా కలెక్టర్ మద్దిపడగ గ్రామానికి వచ్చి చివరి వరకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. సదర్మాట్ అధికారులు మాత్రం మా రైతులను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మే 10వ తేదీ వరకు నీటిని ఇవ్వాలి. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయంలో ఎదుట అధిక సంఖ్యలో రైతులతో ఆందోళన చేపడతాం.
– కమ్మల స్వామి, రైతు, లింగాపూర్
వారబందన్నారు.. నిలిపి వేశారు..
సదర్మాట్ కింద దాదాపు 13 వేల ఎకరాలు సాగు చేసినం. పంట చివరి వరకు నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు రెండు వారాల క్రితమే కాలువను మూసివేశారు. ఈ నీటి విడుదల కోసం అనేక సార్లు అధికారులను కలిసినం. అయినప్పటికీ నీటి విడుదల విషయంలో సతాయిస్తున్నరు. బంగారం తాకట్టు పెట్టి సాగు చేసినం. పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా నీటి విడుదలను నిలిపివేస్తే మా పరిస్థితి ఏంటీ. నీళ్లు విడుదల చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. అధికారులు ఇప్పటికైన స్పందించి మా పంటలకు నీరివ్వాలి.
-గుగ్లావత్ రాములు, రైతు, మద్దిపడగ