సారంగాపూర్, మే 30 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రైతులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 : 30 గంటల వరకు ఏకధాటిగా ఆరు గంటల పాటు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైనే భైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపుల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి నిర్మల్-ఆదిలాబాద్ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. రాస్తారోకో విషయం తెలుసుకున్న మార్కెఫెడ్ డీఎం, ఆర్ఐలు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడినా వినలేదు. కలెక్టర్ హామీ ఇస్తెనే కదులుతామని, లేదంటే రాత్రి వరకు రోడ్డుపైనే ఉంటామని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు.
అధికారుల కాళ్ల మీద పడి వేడుకున్నారు. అంతకు ముందు రైతులు రహదారిపై కూర్చొని సీఎం డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ధర్నా వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రతి రోజు ఆలూర్ సెంటర్‌కు మూడు లారీలు, రైస్‌మిల్లుల వద్ద ధాన్యం కటింగ్ లేకుండా చూస్తామని, జూన్ 5వ తేదీ వరకు సెంటర్లో ధాన్యం లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో ఇరవై రోజులకు పైగా ఇబ్బందులు పడుతున్నామని, లారీల కొరత కారణంగా ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని రైతులు పేర్కొన్నారు. ధాన్యం రైస్మిల్లుల్లోకి చేరిన తర్వాత 40 కిలోల బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తరుగు పేరిట కటింగ్ చేస్తునారని, లారీ డ్రైవర్లు ధాన్యాన్ని తరలించాలంటే ఒక్కొక్క ధాన్యం బస్తాకు రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువుదోపిడికి గురిచేస్తున్న లారీడ్రైవర్లు, రైస్‌మిల్లులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదు. వ్యవసాయానికి ఇంతగా కష్టపడలేదు. వారం రోజులకు పైగా సెంటర్ వద్ద ధాన్యం ఉన్నా ఒక్కరికి కనికరం లేదు. ఏమన్నంటే లారీలు లేవు. ఇప్పుడు అప్పుడు అని రోజులు గడుపుతున్నారు. ధాన్యం మీద కప్పేందుకు పర దాలు కూడా ఇవ్వడం లేదు. పరదాలు కావాంటే ప్రైవేట్ వ్యక్తల వద్ద కొని ధాన్యాన్ని కాపాడు కుంటున్నాం. సెంటర్లో వద్ద రైతులకు సౌకర్యాలు లేవు. అధికారులు పట్టించుకొని లారీల కొరత తీర్చి ధాన్యాన్ని సెంటర్‌కు తరలించి ఆదుకోవాలి. లేదంటే వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతాం. ఐదెకరాల్లో వరి సాగు చేశా. దుక్కులు, విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులు, కలుపు, కటింగ్ వరకు రూ.1.25 లక్షలు ఖర్చు చేశా. వడ్ల పైసలు వస్తే బాకీ తీరుస్తా.
– చందల సాయన్న, రైతు, ఆలూర్.
నేను మూడెకరాల్లో వరి వేసిన. కొనుగోలు కేంద్రా నికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నది. ఇప్పటివరకు వడ్లను కొనలేదు. పశువుల నుంచి వడ్లను కాపాడుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఎండనక, వాననక కష్ట పడి పండిస్తే రైతులను పట్టించుకున్నవారే లేరు. మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నచూ పు చూస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల వెన్నుపూస విరిగొట్టి కొనుగోలు కేం ద్రాల వద్ద కూసోబెడుతున్నారు. లారీ డ్రైవర్లు బస్తాకు రూ.20 నుంచి రూ.30 ఇస్తేను ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నారు. మిల్లర్ల యాజమానులు కూడా ఇదే ఆసరాగా చేసుకొని బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తరుగు పేరిట కోత విధిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులకు చాలా నష్టం జరుగుతది.
– చిన్న సాయన్న, రైతు, ఆలూర్.