ఆదిలాబాద్/నిర్మల్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) :రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్, తాంసి, సిరికొండ, జైనథ్‌లో రైతులు ఆందోళనలు కొనసాగాయి. గుడిహత్నూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు జాతీయ రహదారి 44 బైఠాయించి నిరసన తెలిపారు. బోథ్‌లో ధర్నా నిర్వహించగా ఇచ్చోడలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. జైనథ్ మండలం కాప్రి ఎక్స్‌రోడ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. తాంసిలో రైతులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే తలమడుగు, బజార్హత్నూర్ పోలీస్స్టేషన్లలో 15 మంది రైతులపై కేసులు పెట్టారు.
రుణమాఫీలో భారీగా కోతలు పడడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఆందోళనలు కొనసాగాయి. ఖానాపూర్ మండలానికి చెందిన 100 మందికి పైగా రైతులు ఖానాపూర్లోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. పెంబి మండల కేంద్రంలో రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వీరికి స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. లోకేశ్వరం మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కుభీర్ మండలంలోని మలేగాం గ్రామంలో 200 మందికి పైగా రైతులు భైంసా పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
కుభీర్, ఆగస్టు 20 : మాలేగాం గ్రామంలో రైతులు రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భైంసా-మాలేగాం రహదారిపై వందలాది మంది రైతులు ధర్నా నిర్వహించి రోడ్డును దిగ్బంధం చేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భేషరతుగా రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్.. రేవంత్ డౌన్ డౌన్.. అంటూ హోరెత్తించారు. మాలేగాం గ్రామంలో 610 అకౌంట్లు ఉండగా కేవలం 200 లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని, మిగతా సుమారు 400 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కుభీర్ ఎస్సై రవీందర్ ఘనటన స్థలానికి వెళ్లగా రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రమేశ్, శేల్కే ఆనంద్, శేఖర్‌రెడ్డి, ఎల్లప్ప, ధర్మయ్య, ఒడ్డె హన్మంతు, మల్లాపురం రమేశ్ పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బోథ్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదు ట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ సుభాష్ చందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విభాగం రైతు సంఘం అధ్యక్షుడు బోడ్డు శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు శ్రీధర్‌రెడ్డి, సు రేందర్ యాదవ్, పట్టణాధ్యక్షుడు అల్లకొండ ప్రశాం త్, దివాకర్‌రెడ్డి, రాజారెడ్డి, కుడాల స్వామి, తుల హరీశ్, స్వామి, జక్క బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
జైనథ్, ఆగస్టు 20 : కేసీఆర్ స ర్కారు రైతులను అన్ని విధాల ఆదుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి గురి చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు రోకన్ల రమేశ్ మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగరావ్, మాజీ ఎంపీపీ గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్, లింగారెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
మండలంలోని కాప్రి ఎక్స్ రోడ్డు వద్ద మం గళవారం రైతులు ఆందోళన బాట చేపట్టా రు. కాప్రి, మాకోడ, ఉమ్రి, బెల్గాం, బెల్లూ రి, కరంజి గ్రామాల రైతులు తమకు రైతు రుణమాఫీ జరగకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం రైతులను స ముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈ ధర్నాలో రైతులు రామన్న, ఈరన్న, బండి నర్సింగ్, వెంకన్న పాల్గొన్నారు.
ఖానాపూర్, ఆగస్టు 20 : ‘మేం అర్హులం కాదా? మాకు ఎందుకు రుణమాఫీ వర్తించదు.’ అంటూ ఖానాపూర్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్బీఐ, పీఏసీఎస్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో రుణం తీసుకున్నామని, అర్హత కలిగినప్పటికీ తమకు రుణమాఫీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోపు రత్నం, గాండ్ల శ్రీనివాస్, పెద్ది రమేశ్, లాల నాయక్, రాజమల్లు, శివలాల్, రామారావు, సాయికిరణ్, మాధవరావు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఆగస్టు 20 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశా రు. మంగళవారం ఇచ్చోడ జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ప్రతి గ్రామం తిరుగుతూ రుణాలు మాఫీ కానీ వారి వివరాలు సేకరించి రాష్ట్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే సిరికొండ మండల కేం ద్రంలోని గాంధీ చౌరస్తాలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో నావేగం మాజీ సర్పంచ్ పాండురంగ్, మాజీ ఎంపీటీసీ గాడ్గె సుభాష్, వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నర్వాడే రమేశ్, సాబీర్, రవి, కరీం, మహేందర్‌రెడ్డి, ఈశ్వర్, సాయిరాం, గప్ఫార్, లక్ష్మి, ము త్యం రెడ్డి, దేవానంద్, మారుతి, మహేశ్, గణేశ్, మానిక్, సిరికొండ మాజీ సర్పంచ్ పెంటన్న, రైతులు రాందాస్, పెందూర్, సూర్యకాంత్, లతీఫ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఆగస్టు 20 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ పేరిట మోసం చేస్తున్నాడని మంగళవారం గుడిహత్నూర్ జాతీ య రహదారిపై రైతులు రాస్తారోకో, ధర్నా చేశారు. బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్ రైతులకు మద్దతు తెలిపారు. మొక్కుబడిగా మాఫీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు రోడ్డుపై బైఠాయించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని చాలా మంది ఖాతాదారులకు రుణమాఫీ జరగలేదని బ్యాంక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నాయకులు, రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఎన్‌హెచ్‌పై దహనం చేయగా, మంటలను ఆర్పడానికి పోలీసులు ప్రయత్నించారు. అనంతరం ధర్నా, రాస్తారోకో చేస్తున్న కొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
లోకేశ్వరం, ఆగస్టు 20 : రాయపూర్ కాండ్లి గ్రామానికి చెందిన రైతులు రుణమాఫీ ఎక్కడ అంటూ ఎంఆర్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రాక ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట మార్చి కొంతమందికే రుణమాఫీ చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఎటువంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్వో మోతీరామ్‌కు వినతి పత్రం అందజేశారు.
బజార్హత్నూర్, ఆగస్టు 20 : ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా అర్హులైన రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం వ్యవసాయధికారులను రైతులు నిలదీశారు. దేగాం, బజార్హత్నూర్, పిప్పిరి, జాతర్ల, భూతాయి గ్రామాల నుంచి దాదాపు 100 మందికి పైగా రైతులు రైతు వేదిక వద్దకు చేరుకుని బోథ్ ఏడీఏ శ్రీధర్ స్వామిని నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారుల చుట్టూ పనులు వదులుకుని తిరుగుతున్నా తమ గోడును పట్టించుకున్న వారే లేరని మండిపడ్డారు.
భైంసా, ఆగస్టు 20 : ఆంక్షలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల ని రైతులు మంగళవారం భైంసా ఏడీఏ కా ర్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు మండిపడ్డారు. రైతులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పెంబి, ఆగస్టు 20 : ‘రేవంత్ డౌన్ డౌన్.. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. లేకపోతే దిగిపోవాలి..’ అని రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకు రుణమాఫీ చేయలేదని రైతులు మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఎస్ఐ శంకర్ రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి చేరుకుని నాయకులు, రైతులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ పుండలీక్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భుక్యా గోవింద్, కున్సోత్ విలాస్, సరోజ, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, చింతకింది రాజేందర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, ఆగస్టు 20 : రుణమాఫీ విషయంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడంపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. మంగళవారం బ్యాంక్ మహారాష్ట్ర ఎదుట రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ముందుగా బ్యాంక్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1500 మంది రైతుల అకౌంట్లు ఉంటే.. కేవలం 280 మందికే రుణమాఫీ అయిందన్నారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యకు పరిషరం చూపాలని లేని పక్షంలో రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తాంసి, ఆగస్టు 20 : రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రుణమాఫీ జరిగేలా చూడాలని మండల వ్యవసాయాధికారి రవీందర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాశ్, మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, నాయకులు వినోద్ రెడ్డి, మహేందర్, మలపతి అశోక్, భూమన్న, చంద్రన్న, సురేశ్ పాల్గొన్నారు.
నాకు బ్యాంకులో రూ.1.70 లక్షల రుణం ఉండగా మాఫీ కాలేదు. మా భార్య పేరిట కూడా రూ.1.60 లక్షల రుణం ఉంది. ఏదైనా ఒకటి మాఫీ కావాలి కదా. రూ.2 లక్షలు మాఫీ చేస్తే మీ బాధ్యత తీరుతుంది. ఒకే కుటుంబంలో ఎందరికైనా రుణం ఉండొచ్చు అన్నీ చేయమనడం లేదు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు మెలిక పెట్టి రైతులకు మోసం చేస్తున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి రూ.2 లక్షల రుణాలను మాఫీ చేయాలి. లేదంటే మరో ఉద్యమానికి తెర తీస్తాం.
– శేల్కే ఆనంద్, రైతు, మాలేగాం.
మాలేగాం గ్రామంలో సుమారు 600లకుపైగా అకౌంట్లున్నాయి. అయితే 200లోపు రైతులకే రుణమాఫీ జరిగింది. 60 శాతం మందికి రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం ఒకటి, చేయడం మరొకటి లాగా ఉంది. నాకు రూ.2 లక్షల లోపు రుణం వుంది. కానీ.. రుణమాఫీ వర్తించలేదు. ఇలా గ్రామంలో చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. మాఫీ అయ్యిందని తెలిసి ప్రైవేటు అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. ఈ బాధ ఎవరికీ చెప్పాలి. అందరికీ ఆంక్షలు లేకుండా రుణమాఫీ వర్తింప చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
– మల్లాపురం రమేశ్, రైతు.
నేను 2019 ఆగస్టులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి 1.55 లక్షల పంట రుణాన్ని తీసుకున్న. మూడు విడుతల వరకు ఎదురు చూసినా నిరాశే ఎదురైంది. రూ.2 లక్షల లోపు ప్రకటించిన లిస్టులో కూడా నా పేరు రాలేదు. దీంతో బ్యాంకు అధికారులను కలువగా.. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఎందుకు మాఫీ కాలేదో అర్థం కావడం లేదంటున్నారు. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే అసలు నీకు రుణం ఉన్నట్లు ఆన్లైన్లో చూపించడం లేదు. నో డాటా అని వస్తున్నది. నీకు ఏ బ్యాంకులో కూడా లోన్ లేదని చెబుతున్నరు. మా ఊరిలో ఇలాగే చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. పంట పెట్టుబడి సాయం కూడా అందలేదు. నాకున్న ఆరెకరాల్లో వరి వేసిన. పెట్టుబడి లేక ప్రైవేటు ఫైనాన్స్‌లో లక్ష రూపాయల అప్పు చేయాల్సి వచ్చింది.
– రాజేశ్వర్, రైతు, పాత ఎల్లాపూర్, ఖానాపూర్ మండలం
నాకు పెంబి మండలంలోని నల్లమడుగు కాడ నాలుగెకరాల ఎవుసం ఉన్నది. ఆనకాలం పత్తి, సోయ ఏస్తం. పెంబి బ్యాంకుల 1.20 లక్షల లోన్ తీసుకున్న. మొదటి, రెండో విడుతలో మాఫీ అయిందని బ్యాంకు చుట్టూ తిరిగినా కాలేదు. పంద్రాగస్టు తర్వాత మూడో లిస్టు అస్తది, అప్పుడు రమ్మని అన్నరు. ఇయ్యల్ల మల్లోసారి బ్యాంకుకు అస్తే.. నీకు మాఫీ కాలేదని, అప్పు కట్టాలని బ్యాంకు ఆఫీసర్లు అంటున్నరు. నేను ఏ పాపం చేసిన. రెక్కలు ముక్కలు చేసుకుని భార్య పిల్లలమంతా కలిసి ఎవుసం చేసుకుని బతుకుతున్నం. ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కేసీఆర్ సారే నయముం డే. పోయిన యేడాది రూ.50 వేలు మాఫీ చేసిండు.
– ఆత్రం మత్తన్న, గిరిజన రైతు, నల్లమడుగు, పెంబి మండలం
ఖానాపూర్, ఆగస్టు 20 : మాది ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామం. పట్టణం లోని ఓ బ్యాంకులో నేను, మా భార్య కలిసి రూ.4 లక్షల పంట రుణం తీసుకున్నాం. మాకు ఉన్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో వరి పండిస్తున్నాం. ముందుగా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ ప్రకటిస్తే సంబురపడ్డం. కానీ.. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు రాలేదు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంత గందరగోళంగా ఉంది.
-లాండేరి రాజమల్లు, రైతు, ఖానాపూర్