రుణమాఫీ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.జగన్సింగ్, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వెంకట్ నారాయణలు మాట్లాడుతూ.. రైతులందరికీ బేషరతుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ ఆశన్న, నాయకులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, లంక జమున ,కోవే శకుంతల, సీపీఎంఎల్ మాస్ లైన్ నాయకులు కొడప సురేశ్, కుంరే నితీశ్, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దండేకర్ వామన్, గౌరాల సుభాష్ పాల్గొన్నారు.
ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న అన్నారు. గురువారం ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలవుతున్న పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలతోపాటు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్, ఉపాధ్యక్షురాలు కమల, సహాయ కార్యదర్శి తాజోద్దీన్, నాయకులు అరుణ్, ఫిరోజ్, రాజమణి, రమేశ్, అరుణ్ పాల్గొన్నారు.
నిర్మల్ మున్సిపల్ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య, ఇతర కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించారు. గాంధీ పార్కులో వంటావార్పు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. వేతనాలు చెల్లించే వరకు విధుల్లో చేరమని స్పష్టం చేశారు.