కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తమను నట్టేట ముంచి, దళారులకు లాభం చేకూర్చేలా తీసుకొచ్చిన ఆంక్షలపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శనివారం రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించగా, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, పోలీసులు గేట్లు మూసి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో రైతుల-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గేటు ముందు బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం పెరిగిందని, 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే పత్తి కొనుగోళ్లు చేపడుతామని సీసీఐ నిబంధన పెట్టడం సరికాదని, ఇది ముమ్మాటికీ దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకేనని ఆయన ఆరోపించారు.
పత్తిలో తేమ శాతం 20 వరకున్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేకాకుండా రైతుల వద్ద నుంచి ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన విధించడంతో ఎక్కువ పత్తి దిగుబడి వచ్చిన రైతులు మిగతా పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నదన్నారు. ఈ నిబంధనలు వెంటనే సడలించాలని డిమాండ్ చేశారు. పత్తి అమ్మాలనుకునే రైతులను మరింత ఇబ్బంది పెట్టేందుకే కిసాన్ కపాస్ యాప్ అనే కొత్త నిబంధన తీసుకురావడంతో రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని, యాప్ వినియోగంపై రైతులకు ఏమాత్రం అవగాహన లేదన్నారు.
ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు పేద రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండవని చెప్పుకొచ్చారు. ఈ యాప్‌తో రైతులను ఇబ్బందులకు గురిచేయడమే తప్ప మరేమీ లేదన్నారు. పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ నుంచి జిన్నింగ్‌లలో నియమించిన సిబ్బందిని కూడా ఆంధ్రా నుంచి తీసుకొచ్చారని, ఈ ఆంధ్రోళ్లు ఇక్కడి రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే పత్తి కొనుగోళ్లలో ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోళ్లు జరుపాలన్నారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అడవి పందులు పంటలపై దాడిచేస్తే స్పందించని అటవీ అధికారులు.. చేల వద్ద అడవి పందులు చనిపోతే ఆ రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలను మానుకొని రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. అధికారులు గానీ, మంత్రులు గానీ రైతుల సమస్యలపై ఇంతవరకు స్పందించ లేదని, పత్తి అమ్ముకునేందుకు రైతులు వేలాది రూపాయలు వాహనాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది పక్షం రోజులు సర్వర్ పనిచేయకపోడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు పత్తి అమ్ముకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వెంటనే రైతు భరోసా ఇవ్వడంతో పాటు రూ. 2 లక్షల కంటే ఎక్కువ పంటరుణాలు తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.