చెన్నూరు : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అటు ప్రకృతి కన్నెర్ర చేస్తూ నష్టం చేస్తుండగా ఇటు వ్యాపారస్థులు, రైస్ మిల్లర్లు (Farmers protest ) నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు రోడ్డు బాటన పడుతున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట( Kistampeta) గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు ( Paddy Purchase ) చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై ( National Highway ) బుధవారం ధర్నా చేపట్టారు. సన్న ధాన్యం కొనుగోళ్లులో మిల్లర్లు క్వింటాకు సుమారుగా 16 కిలోల వరకు తరుగు తీసేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులపాలు చేస్తున్న వ్యాపారస్థులు, రైస్మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న చెన్నూరు సీ ఐ దేవేందర్ రావు, ఎస్సై సుబ్బారావు రైతుల వద్దకు చేరుకుని మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు. ధర్నాతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.