ఎదులాపురం, జూలై 17: రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోతున్న రైతులను ఓ రిటైర్డ్ డీఎస్పీ బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాద్రి ఆరోపించారు. శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ 2018లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 107 ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు.
ఎకరానికి రూ.9 లక్షల నుంచి రూ.27 లక్షల చొప్పున వరకు రైతులకు చెల్లించి భూములు కొన్నారని తెలిపారు. కానీ అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించలేదన్నారు. దీంతో రైతుల నుంచి తీసుకున్న సారవంతమైన వ్యవసాయ భూములు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మరో దశలో భూముల కోసం ఎకరానికి రూ.8.25 లక్షలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు వ్యతిరేకించారని తెలిపారు. దీనిపై 27 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అయినప్పటికీ భూములివ్వాలని రైతులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు సుదర్శన్, తోట లచ్చయ్య, గణపతి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.