“బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింపడానికి గోనె సంచులు లేవు. లారీల్లో వేయడానికి హమాలీలు లేరు. ఇన్నీ సమస్యలతో మేమెట్టా వ్యవసాయం చేసేది. మరోవైపు మండుటెండలో రాత్రనక, పగలనక పంట ఉత్పత్తులకు కాపాలా కాయాల్సి వస్తున్నది. మరోవైపు వర్షం భయపెడుగున్నది..” అంటూ రైతులు అధికారులను వేడుకున్నారు. కడుపుమండి జొన్న, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేయకపోవ డంతో కడెం, బాసర, ఉట్నూర్, జైనథ్,ఖానాపూర్ మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు నిలిచాయి. అధికారుల హామీతో ఆందోళనలు విరమించారు.
కడెం, మే 25 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ చౌరస్తా వద్ద మండటెండలో లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట్ మూడు గ్రామాల రైతులు నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కడెం మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాక ధాన్యం తూకం వేయకపోవడం, తూకం వేసిన ధాన్యాన్ని నెల రోజులైన తరలించకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటలకు పైగా ప్రధాన రహదరిపై రైతులు బైఠాయించారు. ఈ క్రమంలో లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆకుల నర్సయ్య స్రృహ కోల్పోయాడు. వెంటనె కొందరు రైతులు నర్సయ్యను హుటాహుటీన ప్రైవేటు వాహనంలో కడెం దవాఖానకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకొని రైతులతో సీఐ అజయ్, ఆర్ఐ శారద, ఎస్ఐ రాహుల్ మాట్లాడిన వినలేదు. రైతులతో మాట్లాడుతున్న ఆర్ఐ శారద కాళ్ల మీద పడి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు ప్రాధేయపడ్డారు. దీంతో వారు రెండు, మూడు రోజుల్లో లారీలు పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ రంజిత్, ఉప సర్పంచ్ కమ్మల స్వామి, బుర్ర రమేశ్ పాల్గొన్నారు.

ఉట్నూర్ రూరల్, మే 25 : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, కేంద్రాలలో ఎర్రటి ఎండలో 20 రోజులపాటు పడగాపులు కాస్తున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ రైతులు ధాన్యపు బస్తాలు రోడ్డపై పెట్టి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో మంద మకరందు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఐకేపీ అధికారులతో వివరాలు సేకరించి లారీ వచ్చే విధంగా చూస్తానని హామి ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్న పది రోజుల క్రితం ఒక లారీ మాత్రమే సెంటర్కు వచ్చిందన్నారు. అందులో సుమారు 700 క్వింటాళ్లు తరలించారని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల కొరత, లారీల రాక రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే నిరీక్షించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎం, డీఎస్వో, ఐకేపీ అధికారులు సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే రోడ్డుపై ధర్నా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జైనథ్, మే 25 : ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ(ఆర్)లో జొన్న రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. పది రోజుల నుంచి జొన్న నిల్వలు పేరుకుపోయాయని ఆందోళన చెంది రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జొన్న నిల్వలకు సరిపడా లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జైనథ్ పోలీసులు మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. ఈ ధర్నాలో మేడిగూడ, రమాయి, సుందరగిరి మాంగూర్ల గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఖానాపూర్, మే 25 : ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టి తరలించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్, బాదన్కుర్తి రైతులు మెట్పల్లి-ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సాయంత్రం 5.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ తహసీల్దార్ సుజాత రెడ్డితో రైతులను ఫోన్లో మాట్లాడించారు. అయినా శాంతించలేదు. దీంతో అక్కడకు చేరుకున్న రెవెన్యూ అధికారులు పీడీతో చర్చించి రైతులతో మాట్లాడించారు. వెంటనే కొనుగోళ్లు ముమ్మరం చేసి ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు దాటినా ఒక ధాన్యం బస్తాను కూడా తరలించలేదని మండిపడ్డారు. ధాన్యాన్ని తూకం వేసేందుకు రూ.50 హమాలీ చార్జీ వసూలు చేస్తున్నారని, లారీలలో ధాన్యం బస్తాలను తరలించేందుకు ఒకో బస్తాకు రూ.5 చొప్పున డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వర్షం పడితే ధాన్యం పూర్తిగా తడిసిపోయి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. “కాళ్లు మొకుతాం.. మా ధాన్యం సమస్యను వెంటనే పరిషరించండి.. అంటూ అకడికి వచ్చిన అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భూసి నరేందర్, జంగిల్ పెద్ద నరసయ్య, జంగిల్ రాజేందర్, పుప్పాల ఉపేందర్, బొమ్మెన రాకేష్, మల్లయ్య, భీమేశ్ పాల్గొన్నారు.
ముథోల్, మే 25 : మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా బాసరలోని బాసర-భైంసా రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.ఈ రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సదరు అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట కోసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయడానికి కేంద్రాల్లో 18 రోజులు అవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. లారీలు రాకపోవడంతో సొంత ట్రాక్టర్లలో మొక్కజొన్నలు తీసుకెళ్తున్నామన్నారు. గోదాముల వద్ద ఐదు రోజులు ట్రాక్టరు ఉన్నప్పటికీ ఖాళీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే హమాలీలను పెంచి గోదాములలో ట్రాక్టర్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
నాకున్న ఐదెకరాల్లో 60 క్వింటాళ్ల జొన్న పంట వచ్చింది. పది రోజుల క్రితమే రైతు వేదిక వద్దకు జొన్నలు తీసు కొచ్చి పగలు, రాత్రి ఇక్కడే పడుకుం టున్న. వచ్చేది వర్షాకాలం కావడం తో భయంగా ఉంది. జొన్న నిల్వలు వర్షంలో తడిసి పోతాయోనని భయంగా ఉంది. వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలి.
నాకు ఈ యేడు 40 క్వింటాళ్ల జొన్న దిగుబడి వచ్చింది. గన్నీ బ్యాగుల కొరతతోపాటు ముఖ్యంగా లారీలు రావడం లేదు. జొన్న నిల్వలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. సరిపడా లారీలు రావడం లేదు. రోజు 10 నుంచి 20 లారీలను పంపితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. లారీలను పంపి జొన్న నిల్వలను ఎత్తి వేయాలి.
నేను నాలుగెరాల భూమి ఉంది. ఇందులో వరి సాగు చేశా. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. లారీలు రావడం లేదని ఇరవై రోజులైన తూకం వేయలేదు. ఒక పక్క వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం వస్తే ధాన్యం తడుస్తుందని బాధ వేస్తున్నది. అధికారుల తీరుతోనే కొనుగోళ్లలో జాప్యం అవుతున్నది. మా ఓపికి నశించి ధర్నా చేశాం. ఐటీడీఏ పీవో లారీలు తెప్పిస్తానని చెప్పాడు. రైతుల కష్టాలు తెలుసుకొని తొందరగా కొనుగోళ్లు చేపట్టాలి.
నేను యాసంగిలో రెండెకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు వడ్లు కొనలేదు. వర్షాలు కురుస్తున్నాయి. తడిస్తే మరల తేమ పెరుగుతది. మరల ఆరబెట్టాలంటే చాలా కష్టం. ఎండలో పానాలు పోయే విధంగా ఉన్నాయి. అధికారులు తొందరగా కొనుగోళ్లు చేపట్టాలి.