తాంసి, జూన్ 4 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్తికావడం లేదని వాపోయారు. తమకంటే తర్వాత మారెట్కు వచ్చిన రైతుల జొన్నలు ఇప్పటికే కొనుగోలు పూర్తయి తరలిపోయాయని, కానీ.. తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మారెట్లో లారీల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రైవేట్ లారీలను ఆశ్రయించాల్సి వస్తున్నదని, దీనివల్ల క్వింటాలుకు రూ.180 వరకు అదనపు భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి జొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.