చెన్నూర్ రూరల్, మే 14: ఇప్పటికే అకాల వర్షంతో ఇబ్బంది పడుతుంటే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని, క్వింటాలు సన్న వడ్లకు 16 కిలోలు, దొడ్డు వడ్లకు 6 కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారని మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తామంటే పండించామని, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులైనా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు క్వింటాలుకు 12 నుంచి 16 కిలోల వరకు కటింగ్ చేస్తామంటున్నారని దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలన్నీ కాంగ్రెస్ నాయకులవి కావడంతో ఆడిందే ఆట పాడిందే పాట అవుతున్నదని, అధికారులు కూడా వాళ్లకే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు ధాన్యం అంతా తడిసిపోయిందని వాపోయారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. చెన్నూర్ సీఐ దేవేందర్, ఎస్ సుబ్బారావు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరినా వినలేదు. దీంతో రైతులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కౌలురైతు, బీజేపీ నాయకుడు బుర్ర రాజశేఖర్ గౌడ్ చొక్క చిరిగిపోయింది.
సీఐ దేవేందర్ సముదాయించడంతో రైతులు విరమించారు. అనంతరం సీఐ దేవేందర్‌తో పాటు వ్యవసాయ శాఖ ఏడీఏ బానోత్ ప్రసాద్‌ను తీసుకువెళ్లి తడిసిన వడ్లను రైతులు చూపించారు. అదనపు కలెక్టర్‌తో ఏడీఏ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలని, సన్నవడ్లను కూడా కటింగ్ లేకుండా కొనాలని నిర్వాహకులను అదనపు కలెక్టర్ ఆదేశించడంతో రైతులు శాంతించారు.
నేను నాకున్న 8 ఎకరాల్లో సన్న ధాన్యాన్ని పండించాను. 20 రోజుల కింద సెంటర్‌కు తీసుకవచ్చిన. సన్నం వడ్లను మిల్లర్లు తీసుకోవడం లేదంటూ సెంటర్ నిర్వాహకుడు తెలిపాడు. ఒకవేళ కొన్నా క్వింటాలుకు 12 నుంచి 16 కిలోలు కోత పెడుతామంటుండ్రు. అది కూడా మ్యాచర్ ఉంటేనే తీసుకుంటామంటుండ్రు. 20 రోజుల నుంచి నా వడ్లకు నేను కావలి ఉంటున్నా. ఇప్పటికే వానతో ఇబ్బంది పడుతుంటే ధాన్యానికి కటింగ్ పేరుతో మరింత ఇబ్బంది పేడితే ఎలా..? ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి.
– చేతెల్లి సమ్మిరెడ్డి, కిష్టంపేట
సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 ఇస్తామని కాంగ్రెస్ సర్కారు చెబితే పండించిన. నాలుగు ఎకరాల్లో సన్న ధాన్యాన్ని సాగు చేశాను. వారం క్రితం సెంటర్‌కు తీసుకువచ్చిన. మిల్లర్లు సన్న ధాన్యాన్ని తీసుకోవడం లేదంటూ సెంటర్ నిర్వాహకుడు అంటున్నడు. ఒక వేళ గత్యంతరం లేక విక్రయిస్తే క్వింటాలుకు 16 కిలోల వరకు కోత పెడుతున్నారు. బోనస్ డబ్బులు ఆశతో సన్న రకం వడ్ల పంట వేస్తే ఇలా రైతులను మోసం చేయడం తగదు. దొడ్డు రకం వడ్లకు కూడా కటింగ్ చేస్తున్నరు. లారీలు రావడం లేదంటూ ఆలస్యం చేస్తున్నారు.
-బొమ్మ రాజిరెడ్డి, కిష్టంపేట