కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ దహెగాం, మే 14 : దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. క్వింటాలుకు ఐదారు కిలోల చొప్పున దోచుకునేలా కాంటాలను సెట్ చేయడంపై రైతన్నల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ మేరకు మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద అన్నదాతలు ధర్నాకు దిగడంతో పాటు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు ఫిర్యాదు చేశారు.
ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్విం టాలుకు 5 నుంచి 6 కిలోల ధాన్యం తక్కువగా వస్తోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తూకం తక్కువ వచ్చేలా కాంటాల్లో సెట్టింగ్ మార్చారు. బస్తా ధాన్యానికి రెండు.. మూడు కిలోల ధాన్యం తక్కువగా చూపిస్తుండగా, క్వింటాలుకు ఐదారు కిలోల తేడా వస్తోంది. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 220 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేపడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2203 చొప్పున కొనుగోలు చేస్తుండగా, కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుతో రైతులు మోసపోక తప్పడం లేదు.
ఒడ్డుగూడ గ్రామానికి చెందిన రైతు సత్తయ్య సోమవారం రాత్రి అదే ఊరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 500 బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు. తను అంచనా వేసుకున్న దిగుబడికి.. కేంద్రంలో వచ్చిన తూకానికి తేడా ఉండడంతో మంగళవారం ఉదయం కొనుగోలు కేంద్రానికి వెళ్లి తాను విక్రయించిన ధాన్యం బస్తాల్లోనుంచి ఒక బస్తాను తీసుకొళ్లి ప్రైవేట్ కాంటాపై తూకం వేయించారు. అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రంలో 40 కిలోల 500 గ్రాములుగా ఉన్న ధాన్యం బస్తా.. అదే ప్రైవేట్ కాంటాపై 43 కేజీలు దూగింది. ఇలా నాలుగైదు బస్తాలను తూకం వేసి చూశాడు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు ఐదారు కిలోల ధాన్యం తక్కువగా చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తోటి రైతులకు చెప్పడంతో వారంతా కలిసి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు తుమ్మిడి నారాయణ వల్లే తాము మోసపోయామంటూ రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇతను పనిచేసిన గిరివెళ్లి కొనుగోలు కేంద్రంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని రైతులు తెలిపారు.
ఒడ్డుగూడ కొనుగోలు కేంద్రంలో 500 బస్తాల ధాన్యాన్ని అమ్మిన. తూకంలో మోసం చేస్తున్నట్లు నాకు అనుమానం వచ్చింది. దీంతో మళ్లీ కేంద్రానికి వెళ్లిన. నేను అమ్మిన బస్తాల్లో నుంచి కొన్నింటిని తీసి ప్రైవేట్ కాంటాపై తూకం వేసిన. క్వింటాలుకు ఐదారు కిలోల తేడా వచ్చింది. అధికారులు స్పందించి మాలాంటి రైతులకు న్యాయం చేయాలె. ఈ విషయంపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. – సత్తయ్య, రైతు
ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసం గురించి నాకు తెలిసింది. క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల వరకు తక్కువగా తూకం వస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులను పంపించి విచారణ జరిపిస్తా. తూకాల్లో మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తా.
– వినోద్‌కుమార్, డీసీఎస్వో