కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ‘యాసంగిలో వరి పంటకు నీళ్లు పెడుదామంటే చెలిమెల ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు రావు..కరెంటు మోటార్ల ద్వారా నీళ్లు పెడుదామంటే కరెంటు ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో.. తెలియడం లేదు’ అంటూ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగిలో కాలువల్లోని నీటిని కరెంటు మోటార్లు పెట్టుకొని పంటలను దక్కించుకున్నారు. ఈ ఏడాది ఇటు కాలువల్లో నీళ్లు లేక..సరైన కరెంటు సరఫరా లేక పొట్ట దశలో ఉన్న వరికి నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
తిర్యాని మండల రైతులకు ప్రధానమైన సాగునీటి వనరు చెలిమెల(ఎన్టీఆర్) ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా యాసంగిలో దాదాపు 200 ఎకరాల్లో రైతులు వరి సాగుచేసేవారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుని కాలువలను ఆధునీకరించి యాసంగిలో రైతుల పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నది. సరైన వర్షాలు లేనప్పుడు పంట కాలువలతో నీరు అందని సమయంలో రైతులు 24 గంటల ఉచిత విద్యుత్‌ని వినియోగించుకొని యాసంగిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగుచేసుకున్నారు. ప్రతి యాసంగిలో ఈ ప్రాజెక్టు కింద దాదాపు 180 ఎకరాల వరి సాగయ్యేది. కాని ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం 80 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది. పంట కాలువల ద్వారా నీళ్లు రావడం లేదు. పంట కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.
చెలిమెల ప్రాజెక్టు ద్వారా పంటల పొలాలకు నీరు చేరడం కష్టంగా మారింది. ప్రాజెక్టులో ఉన్న కొద్ది పాటి నీటిని కూడా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది. చెలిమెల ప్రాజెక్టు ద్వారా నీరు అందకపోతే కరెంటు మోటార్ల ద్వారానైన పంటలకు నీళ్లు పెడుదామంటే కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది యాసంగిలో మోటార్ల ద్వారా పంటలకు పుష్కలంగా నీరు పెట్టుకొని యాసంగిని సాగుచేసుకున్న రైతులు ఈ ఏడాది కరెంటు కష్టాల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రాజెక్టు కాలువలు సరిగా లేకపోవడం, కరెంటు కోతలతో రైతులు యాసంగిలో పంటల సాగుని తగ్గించుకున్నట్లుగా తెలుస్తున్నది. పొట్టదశకు వస్తున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చెలిమెల ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేయాలని, కరెంటు సరఫరాను అంతరాయం లేకుండా అందించాలని రైతులు కోరుతున్నారు.