ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 14 : జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సర్వర్ డౌన్ పేరిట సీసీఐ సుమారు పది రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ వేయగా, పత్తి వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏ జిన్నింగ్ మిల్లు వద్ద చూసినా వందల సంఖ్యలో వాహనాల వరుసలు కనిపిస్తున్నాయి.
ఒక్కో వాహనానికి రోజుకు రూ. 1000 నుంచి రూ. 1200 దాకా వెయిటింగ్ చార్జీలు భరించాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీసీఐ కొనుగోళ్ల లక్ష్యం పూర్తయ్యిందని, సోమవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ఉండబోవని వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా పత్తి కొనుగోళ్లు చేపట్టి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.