నిర్మల్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు.. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. వారి సూచనలను పాటిస్తున్న జిల్లా రైతు లు.. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న మక్కజొన్న సాగుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,960 మద్దతు ధర కల్పిస్తున్నది. రెండేళ్లుగా ఈ పంటకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2,200 నుంచి రూ.2,500 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున మక్కజొన్న సాగు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 72 వేల ఎకరాల్లో మక్కను సాగు చేయగా.. ఈ సారి 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద, మామడ, సోన్, నిర్మల్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(జీ) మండలాలతో పాటు ముథోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, భైంసా, కుంటాల మండలాల్లోని రైతులు అధికంగా మక్కజొన్న సాగు చేస్తున్నారు. కాగా.. మిగతా పంటలైన శనగ 60 వేల ఎకరాలు, వరి 85 వేల ఎకరాలు, జొన్న 4 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
మక్క సాగుతో అధిక లాభాలు
వరి పంట మాదిరిగా మక్కజొన్న పంటకు సాగు నీటిని అధికంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సాగు చేసేందుకు పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువే. ఆరుతడి పంట కావడంతో లాభాలు కచ్చితంగా వస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరితో పాటు పసుపు, ఇతర వాణిజ్య పంటలకు పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో పాటు తెగుళ్లు సోకుతుండడం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మక్కజొన్న పంట సాగులో రైతుల పర్యవేక్షణ కూడా పెద్దగా అవసరం లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు దీనిని సాగు చేస్తున్నారు. పండిన పంటను ప్రభుత్వమే క్వింటాల్‌కు రూ.1,960 చెల్లించి కొనుగోలు చేస్తుండడం వం టివి రైతులను మక్క సాగు వైపు మళ్లిస్తున్నాయి. కాగా.. ఈ నెలాఖరు వరకు మాత్రమే మక్కజొన్న సాగుకు అనుకూల సమయమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కాగా, సిద్దిలకుంటకు చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి 8 ఎకరాల్లో మక్కజొన్న వేశాడు. అది ఏపుగా పెరుగుతుండడంతో ఎకరానికి 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుడి వస్తుందని అంచనా వేస్తున్నాడు. కాగా, రైతులు సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా పంటలు వేస్తే మంచి లాభాలు గడించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ రైతులకు సూచిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరుస్తున్నామని చెబుతున్నారు. మక్క సాగు తో తక్కువ పెట్టుబడి ఖర్చులతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని, ఎకరాకు పెట్టుబడి ఖర్చులు పోనూ రూ.60 నుంచి రూ.70వేల ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు.