బేల, జూలై 3 : ఓ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు కొని విత్తగా, అవి మొలకెత్తక సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోయామని బేల మండలంలోని కాప్సీ(బీ) గ్రామానికి చెందిన 26 మంది రైతులు వాపోయారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ విత్తనాలతో కొనుగోలుతో పాటు ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి ఒకో ఎకరానికి సుమారు రూ.8 వేల వరకు వ్యయం చేశామని రైతులు తెలిపారు.
విత్తనాలు మొలకెత్తకపోవడంతో పెట్టుబడి మొత్తం వృథా అయిందని వాపోయారు. ఇప్పుడు మళ్లీ విత్తనాలు కొని సాగు చేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు వచ్చి చేలను పరిశీలించి విత్తనాల నాణ్యతపై విచారణ జరిపి బాధ్యులైన ప్రైవేట్ విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.