మంచిర్యాల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తేయగా, రైతాంగం రేవంత్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2024-25 రబీ సీజన్లో సన్న ధాన్యం అమ్మిన రైతులకు దాదాపు ఆరు నెలలుగా రూ.500 బోనస్ పడలేదు. మొత్తంగా 6,814 మంది రైతులకు రూ.19.17 కోట్ల బోనస్ ఈ సర్కారు బాకీ పడింది.
మంచిర్యాల జిల్లాలో రబీ సీజన్లో 1041 మంది రైతులు 6,925 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. నిర్మల్ జిల్లాలో 4,483 మంది రైతులు 25 వేల మెట్రిక్ టన్నులు, ఆసిఫాబాద్ జిల్లాలో 1290 మంది రైతులు 5800 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని విక్రయించారు. దొడ్డు ధాన్యం విక్రయించిన రైతులతో పాటే సన్నధాన్యం విక్రయించిన రైతులకు మద్దతుధర డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. కానీ, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలుపై ఇస్తామన్న రూ.500 బోనస్ మాత్రం ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఇప్పటికైనా పెండింగ్ ఉన్న బోనస్ ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు.
బోనస్ డబ్బులివ్వలే.. రుణమాఫీ కాలే..
నిర్మల్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : సన్నరకం వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబితేనే గత యాసంగిలో సన్నాలు సాగు చేశా. బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. నాతో పాటు మరో 20 మందికి పైగా రైతులకు బోనస్ డబ్బులు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. నాకు మా ఊరిలో ఐదెకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల ద్వారా సాగునీటిని అందిస్త. యేటా రెండు పంటలు పండిస్తా. తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు కొడుకులు మొత్తం ఆరుగురం ఎవుసంపైనే ఆధారపడి జీవిస్తున్నం. గత యాసంగిలో కరెంటు కష్టాలు ఉన్నప్పటికీ రేయింబవళ్లు కష్టపడి బోనస్ వస్తుందన్న ఆశతో సన్నాలు పండించిన. సన్నవడ్ల సాగుకు పంటకాలం కూడా ఎక్కువ కావడంతో చివరి దశలో నీరందక, తెగుళ్లు సోకి ఆశించిన దిగుబడి రాలేదు.
ఐదెకరాల్లో 258 సంచుల దిగుబడి వచ్చింది. స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించిన. తరుగు, తప్ప తాలు పేరిట అన్ని కటింగ్‌లు పోను 95 క్వింటాళ్లకు తూకం వేశారు. బోనస్ డబ్బులు రూ.47,500 మాత్రం రాలేదు. సన్న వడ్లు ఎకరానికి కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. అదే దొడ్డురకం వేసి ఉంటే ఎకరానికి 25-30 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా మోసం చేస్తుందని అనుకోలేదు. నా రెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. బోనస్ కష్టాలకుతోడు రుణమాఫీ కూడా కాలేదు. నా పేరు మీద రూ. 2 లక్షలు, భార్య నవనీత పేరు మీద రూ.లక్ష వరకు రుణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అన్నీ ఇబ్బందులే.
– గంజాల విజయ్, రైతు, నర్సాపూర్(జీ) మండలం, రాంపూర్
రూ.1.10 లక్షలు రావాలి
పోయిన సీజన్లో నా కొడుకుతో పాటు నా పేరుతో ఉన్న 12 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేసిన. మద్దతు ధర కాకుండా బోనస్ రూపంలో రూ.1.10 లక్షలు వస్తాయని ఆశపడి సన్నాలు వేసిన. కష్టమైనా బోనస్ వస్తే చాలనుకున్న. దాదాపు 220 క్వింటాళ్ల సన్న ధాన్యం లక్ష్మీపూర్ సెంటర్లో విక్రయించిన. నాతో పాటు గుర్రం సమ్మయ్య అనే రైతు కూడా 20 క్వింటాళ్ల బియ్యం మా లారీలోనే వేసుకొని పోయి అమ్మిండు. ఇప్పటి దాకా ఎవరికీ బోనస్ పడలేదు. నెలలుగా ఎదురుచూస్తున్నం. ఈ సారి కూడా 12 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేస్తున్నం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలనుకుంటున్నం. 200 క్వింటాళ్ల ధాన్యం పక్కాగా వస్తది. పోయినసారి, ఈ సారి బోనస్ కలిపి వేస్తే బాగుంటుంది. రైతులపై ప్రేముంటే ఇప్పటికైనా బోనస్‌ను వెంటనే జమ చేయాలి. రైతులను ఆశపెట్టి మోసం చేయడం సరికాదు.
– గోనె సత్యనారాయణ, వెలమపల్లి
పైసలు రాలే..
సోన్, నవంబర్ 26 : నాకున్న ఐదెకరాల్లో సన్న రకం వరి సాగు చేశా. అంతంత దిగుబడి వస్తదని తెలిసినా.. బోనస్ పైసలకు ఆశ పడి సన్న వడ్లు వేసిన. ఆరు నెలల క్రిం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన. మొత్తం 70 క్వింటాళ్ల ధాన్యానికి ఇప్పటివరకు బోనస్ పైసలు రాలే. నాకు రూ.30 వేల దాకా బోనస్ డబ్బులు రావాలి. నెలలు గడిచి ఖరీఫ్ సీజన్ ధాన్యం చేతికొచ్చినా రబీలో సాగు చేసిన సన్నరకం బోనస్ పైసల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్న. కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్పందిస్తే బాగుంటుంది.
– వీరమల్ల నవీన్, రైతు, వెంగ్వాపేట్, నిర్మల్ మండలం
కాంగ్రెస్ సర్కారు ఎగ్గొట్టింది
దహెగాం, నవంబర్ 26 : మూడెకరాల్లో కేఎన్ఎం-1468 సన్న రకం వడ్లు పెట్టిన. ఎండకాలం దిగుబడి వస్తదని తెలిసినా బోనస్ కోసం ఆశపడి పంట వేసిన. మొత్తం 50 క్వింటాళ్ల వడ్లు పండినయి. మా ఊరిలో సొసైటీవాళ్లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మిన. కాంట పెట్టేటప్పుడు క్వింటాలుకు మూడు కిలోలు కోత పెట్టిన్రు. పోనీలే అనుకున్న. క్వింటాలుకు రూ. 2,389 చొప్పున మొత్తం 50 క్వింటాళ్లకు రూ. 1,19,450 నా బ్యాంకు ఖాతాలో వేసిన్రు. బోనస్ డబ్బులు మాత్రం వేయలేదు. అప్పుడు వడ్లు అమ్మినప్పుడు ప్రైవేటోళ్లు వచ్చి ఎక్కువ ధర ఇస్తామన్నరు. కానీ బోసస్కు ఆశపడి ఇవ్వలే. గీ సర్కారు చెప్పిన మాటలు నమ్మితే మోసం చేసిన్రు. బోనస్ ఎగ్గొట్టిన్రు..
– రౌతు ప్రకాశ్, గిరివెల్లి
