మంచిర్యాల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో బీతావాహ పరిస్థితులు కనిపించాయి. ఎగువనున్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. రోడ్లు, కల్వర్టులు కొట్టుకపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఇదంతా ఒక ఎత్తైతే.. భారీ వర్షాలు, వరదలకు పంట పొలాలు నీట మునిగాయి. పెద్ద మొత్తంలో వరి, పత్తి, కూరగాయాల పంటలు దెబ్బతిన్నాయి. ఏపుగా ఎదిగిన మొక్కలు నీట మునిగి వాడిపోయాయి. వరద తాకిడి వరి పైరు కొట్టుకపోయింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 7,952 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలోని 11 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 3230 ఎకరాల్లో వరి, 4698 ఎకరాల్లో పత్తి, 22 ఎకరాల్లో కూరగాయలు, రెండు ఎకరాల పసుపు పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో పంట నష్టం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 918 ఎకరాల్లో వరి, 1211 ఎకరాల్లో పత్తి నీట మునిగింది.
పసుపు పంట సైతం నష్టపోవాల్సి వచ్చింది. భీమిని మండలంలో 245 ఎకరాల్లో వరి, 941 ఎకరాల్లో పత్తి, 20 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వేమనపల్లిలో 520 ఎకరాల వరి, 650 ఎకరాల పత్తి పంటలను వరదలు మంచెత్తాయి. బెల్లంపల్లి మండలంలోనూ దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
భారీ వర్షాలు, వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడితే గానీ రెక్కాడితే డొక్కాడని బతుకులనీ, పంట నష్టంతో లక్షల రూపాయలు పెట్టుబడి నీళ్ల పాలయిందని వాపోతున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సర్కారు సాయం చేయాలే..
మాది కన్నేపల్లి. ఎడతెరిపి లేని వానతో మా పత్తి చేనులోకి భారీగా వరద చేరింది. పత్తి చెట్లు ఏపుగా పెరిగినయ్. ఈ సారి దిగుబడి మంచిగా వస్తుందని ఆశపడ్డాం. కానీ వరదలు మా చేను మొత్తం ముంచెత్తినయ్. దాదాపు లక్ష నష్టపోయాం. కంటికి రెప్పలా కాపాడుకున్న పత్తి కండ్ల ముందే నాశనమైపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలే. అప్పులపాటు కాకుండా మాకు సాయం చేయాలే. – గురుండ్ల శ్రీమతి, కన్నేపల్లి
నాలుగు ఎకరాల పంట మునిగింది..
నేను నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేసిన. చేను ఏపుగా పెరిగిందని సంతోష పడ్డా. కానీ వర్షాలతో నెన్నెల ఎర్రవాగు పొంగి నా చేనును మొత్తం నీళ్లలో ముంచింది. లక్షన్నర దాకా నష్టం జరిగింది. పెట్టుబడికి అప్పులు తెచ్చినం. పంటకు పరిహారం ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలే. రైతులకు అండగా నిలవాలే.
– ఠాకూర్ అరుణ్‌కుమార్, నెన్నెల
Adilabad4