ఆరుగాలం కష్టపడి, పెట్టుబడికి అప్పులు చేసి సాగుచేసిన పంటలను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో జొన్న కుప్పల వద్ద రాత్రి, పగలూ రోజుల తరబడి రైతులు కాపలాకాస్తున్నారు. చేతికి అందిన పంట అకాల వర్షానికి తడవకుండా కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ పంట కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అప్పులు చేసి సాగు చేసిన వానకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలతోనైనా అప్పులు తీర్చి గట్టెక్కుదామనుకున్న రైతులకు పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరాశే మిగులుతున్నది. యాసంగిలో సాగు చేసిన శనగ, మక్క పంటల కొనుగోళ్లు సగంలో ఆగిపోగా, జొన్నల సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. జొన్నలను కొనాలని కోరుతూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వ్యవసాయశాఖ మంత్రితో పాటు అధికారులను వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే వారు తక్కువ ధర కొనుగోలు చేస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 39,189 మంది రైతులు 1.12 లక్షల ఎకరాల్లో రైతులు జొన్న పంటను సాగు చేశారు. ఎకరానికి 22 నుంచి 25 క్వింటాళ్ల వర కు పంట దిగుబడి వచ్చింది. పంట చేతికి వచ్చినా కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్న క్వింటాలుకు రూ. 3749 మద్దతు ధర ప్రకటించగా ప్రైవేట్‌లో క్వింటాలుకు రూ. 2200లో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1449 చొప్పున తక్కువ ధరతో కొంటుండడంతో రైతులు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పంటను కోసిన రైతులు చేలలో నిల్వ ఉంచారు.
జిల్లాలో రెండ్రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండడంతో జొన్నలు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట తడిసిపోతే నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజన్‌కు ముందుగానే మద్దతు ధరతో పంట కొనుగోళ్లను ప్రారంభించి రైతులు నష్టపోకుండా చర్యలు తీ సుకున్నది. రెండు సీజన్లలో రైతులు పం డించిన పంటల కొనుగోళ్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోళ్లు సరిగా చేపట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో రైతులు సాగు చేసిన జొన్న పంట కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చి 15 రోజులైనా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.2200 ధరకే విక్రయించి నష్టపోతున్నారు. పంట పొలాల్లో నిల్వల వద్ద రాత్రి, పగలూ కాపలా కాస్తున్నారు. ఇటీవల వర్షం కారణంగా బోథ్ మండలంలో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే జొన్న పంట కొనుగోళ్లను ప్రారంభించాలి.
– సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు