ఆదిలాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో యేటా దీపావళి వరకు పంటలు చేతికొచ్చి పండుగను రైతులు సంతోషంగా జరుపుకునే వారు. యేటా మాదిరి ఈసారి దీపావళిని సంతోషంగా జరుపుకోవాల్సిన రైతులు పంటల కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. జిల్లాలో పత్తి, సోయా పంటలు చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించలేదు. ప్రతి సంవత్సరం దసరా నాటికి సోయాబిన్, పత్తి కొనుగోళ్లు ప్రారంభవుతాయి. ఈ ఏడాది మాత్రం దీపావళి వచ్చిన కొనుగోళ్లు ప్రారంభంకాలేదు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో పత్తి పంటను నిల్వ చేస్తున్నారు. సోయాబిన్ను మార్కెట్ యార్డులకు తీసుకొస్తున్నారు. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్ముదామనుకుంటే మద్దతు ధర కంటే తక్కువ ధర ఉండడంతో ముందుకు రావడం లేదు. ఈ ఏడాది రైతులు 4.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పది రోజుల నుంచి పంటను తీయడం ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ సీసీఐ ద్వారా పంటను మద్దతు ధర క్వింటాలుకు రూ.8110తో సేకరించాల్సి ఉండగా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.6,200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంటను నష్టపోయిన తాము ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి తర్వాత సోయాబిన్ పంటను అధికంగా పండిస్తారు. పంటకా లం తక్కువగా ఉండడం, మిగతా పంటల కంటే పెట్టుబడి తక్కువ, యంత్రాలతో పంటను తీసే సౌకర్యం ఉండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతారు. వానకాలం సీజన్లో రైతులు 62,500 ఎకరాల్లో సోయా సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి బాగా తగ్గింది. కాత దశలో ఉండగా పడిన వానల వల్ల గింజలు నల్లబారిపోయాయి. ఫలితంగా ఎకరాకు పది క్వింటాళ్లు రావాల్సిన సోయా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు మాత్రమే వచ్చిం ది. ఉన్న పంటను పక్షం రోజుల కిందట రైతులు హార్వేస్టర్లతో తీయడం ప్రారంచారు.
జిల్లా వ్యాప్తంగా కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రా రంభించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు మార్కెట్ యార్డులకు పంటను తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5328 ప్రకటించగా.. ప్రై వేటు వ్యాపారులు క్వింటాలుకు రూ. 4300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించి భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఈ ఏడాది వర్షాలతో పత్తి, సోయా దిగుబడులు సగానికి పడిపోయాయి. నేను ఐదెకరాల్లో పత్తి సాగు చేయగా.. 20 క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం కనపడడం లేదు. పంట దిగుబడులు ప్రారంభమైనందునా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. తీసిన పంటను ఉంచడానికి స్థలం లేకపోవడంతో గ్రామ సమీపంలో ఆరు బయట నిల్వచేసి కాపాల ఉంటున్నాం. యేటా దీపావళి వరకు కొను గోళ్లు ప్రారంభమయ్యేవి. ఈ సంవత్సరం ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో దీపావళి పండుగ జరుపుకునేందుకు డబ్బుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది.
– వెంకట్రెడ్డి, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం