ఆదిలాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వానకాలంలో సాగు చేసిన సోయాబిన్ పంటను మార్కెఫెడ్ ద్వారా సేకరించగా, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. యాసంగిలో 1.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో జొన్న 70,520 ఎకరాలు, శనగ 68,500.. మొక్కజొన్న 18,220.. గోధుమ 4,650 ఎకరాల్లో వేయనున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగిలో సాగు చేసిన శనగ పంట చేతికి వచ్చింది. జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు పంటను కోసి కుప్పలు వేశారు. కొన్ని రోజుల్లో మిగతా పంటలు కోతకు రానున్నాయి.
రైతులు సాగు చేసిన పంటలను కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా క్రాప్ బుకింగ్ విధానం అమలు చేస్తుంది. ప్రతి సీజన్లో రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో ఎన్ని ఎకరాల పంటలు వేశారనే వివరాలను సేకరిస్తారు. జిల్లాలోని 102 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా మండల వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ వివరాలను రైతులవారీగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాలను ఆన్లైన్లో మార్కెటింగ్‌శాఖ అధికారులకు చేరుతాయి. వీటి ఆధారంగా మార్కెట్ యార్డుల్లో పంటలను కొనుగోలు చేస్తారు. ఈ విధానం వల్ల దళారులు తమ పంటలను ప్రభుత్వం కేంద్రాల్లో విక్రయించే అవకాశాలు ఉండవు. పంటల కొనుగోళ్లకు రెండు నెలల ముందుగానే ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో క్రాప్ బుకింగ్ కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకుంది. ఈసారి మద్దతు ధరతో తమ పంటలను కొనుగోలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంటలకు సంబంధించిన క్రాప్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సీజన్లో డిజిటల్ విధానంలో క్రాప్ బుకింగ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. పంటల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఆదిలాబాద్.