ఆదిలాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : పండుగ పూట కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పలేదు. ఎడ్ల పొలాల అమావాస్య పండుగను సంతోషంగా నిర్వహించుకోవాల్సిన రైతులు శుక్రవారం యూరియా పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది. పండుగ పూట కూడా అవస్థలు పడాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా బసవన్నలను అలంకరించి పిండి వంటలలునైవేద్యాలు సమర్పించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకల్లో నిమగ్నమై ఉండాల్సిన రైతులు జిల్లా కేంద్రంలో యూరియా కోసం బారులు తీరాల్సి వచ్చింది.
ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి, సోయాబిన్ పంటలు దెబ్బతినగా ఎదుగుదలపై ప్రభావం చూపింది. ఉన్న పంటనైనా కాపాడునేందుకు యూరియా వేయాల్సి ఉండగా ఎరువుల కొరతతో రైతులు సతమతమవుతున్నారు. యూరియా వచ్చిందని తెలియగానే జిల్లా కేంద్రంలోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు పెద సంఖ్యలో బారులు తీరారు. రెండు నుంచి మూడు గంటల పాటు నిల్చోవాల్సి వచ్చింది. ఒక్కో రైతుకు మూడు సంచులు మాత్రమే దుకాణాదారులు పంపిణీ చేశారు.
కొందరికీ సరిపడా దొరకక, మరికొందరికి మొత్తానికే దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. యూరియా సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరారు. జిల్లా కేంద్రంలోని 3600 సంచుల యూరియా స్టాక్ ఉందని రైతులకు అందేలా చర్యలు తీసుకున్నట్లు మండలం వ్యవసాయశాఖ అధికారి నగేశ్ రెడ్డి తెలిపారు.
నాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, సోయాబిన్ పంటలు వేసినం. ఎండలు కొడుతుండడంతో పత్తి పంటకు యూరియా వేస్తే దిగుబడులు బాగా ఉంటయ్. మా సొసైటీ పరిధిలో యూరియా కొందరికే ఇస్తుండ్రు. యూరియా కోసం ఆదిలాబాద్‌కు వచ్చినం. ఇక్కడ ఒక్కో రైతుకూ మూడు సంచులే ఇస్తామంటున్నరు. రైతులు పెద్దగా నిర్వహించే పొలాల అమావాస్య పండుగ రోజు కూడా యూరియా లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. పండుగను సరిగా చేసుకోలేకపోతున్నం. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు పట్టించుకొని యారియా కొరత లేకుండా చూడాలె.
– రాజేశ్వర్, రైతు, గూడ రాంపూర్, జైనథ్ మండలం
నేను పది ఎకరాల్లో పత్తి, సోయాబిన్ పంటలు వేసిన. పత్తి చెట్లు మంచిగా పెరగాలంటే, ఎక్కువ దిగుబడి రావాలంటే ఈ టైమ్‌లోనే యూరియా వేయాలి. రెండు గంటల నుంచి లైన్ల్లో నిల్చున్న. ఒక్కో రైతుకు మూడు సంచులే ఇస్తుండ్రు. అవి కూడా ఎటూ సరిపోవడం లేదు. రైతులు సంతోషంగా చేసుకునే పొలాల పండుగ రోజు కూడా యూరియా కోసం గోస పడాల్సి వస్తుంది. మరిన్న ఎరువులు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సరిపోయేలా యూరియా, ఇతర ఎరువులు సైప్లె చేయాలే.
– పరశురాం, రైతు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్ మండలం