నిర్మల్, మే 8(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా, కాంగ్రెస్ సర్కారు తీరుపై పలువురు రైతులు తమ ఆవేదనను ‘నమస్తే’తో వెల్లడించారు.
కనకాపూర్ గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు తన ఐదెకరాల వ్యవసాయ భూమిలో.. మూడెకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో వరిపంట సాగు చేశాడు. అనేక ఇబ్బందులు, అధికారులు పెట్టిన అడ్డగోలు కొర్రీలతో ఎట్టకేలకు వారం రోజుల కింద మక్క పంటను విక్రయించాడు. వారం రోజులుగా వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వచ్చి మాయిశ్చర్ వచ్చింది కొంటామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వడ్ల కుప్పలపై పారిలు కప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజూ కాపలా ఉంటున్నాడు.
గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పల అడుగుభాగంలో నీళ్లు చేరాయి. దీంతో తడిసిన వడ్లను మళ్లీ ఆరబెడుతూ.. అధికారులు సకాలంలో పంటను కొనుగోలు చేస్తే ఈ బాధలు తప్పేవంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. వడ్యాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజు, రేపు అంటూ గన్నీ బ్యాగులు సైతం ఇవ్వకుండా కేంద్రం నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని రైతు నారాయణ వాపోయాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, తమ మండలంలో 15 రోజులుగా రైతులందరికీ ఇలాంటి బాధలే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఏ రైతును కదిలించినా ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధానంగా పంట ఉత్పత్తులను విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా అనేక ఆంక్షల మధ్య మక్కలను కొనుగోలు చేస్తుండగా, రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. మక్కలను తరలించేందుకు సరిపడా లారీలను ఏర్పాటు చేయకపోవడంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అనేక ఇబ్బందుల మధ్య తూతూ మంత్రంగా కొనుగోళ్లు చేస్తుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
మక్కల కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో ఎక్కడికక్కడ మక్కల కుప్పలు పేరుకుపోయాయి. మరోవైపు వరిధాన్యం సైతం మార్కెట్‌ను ముంచెత్తుతున్నది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సైతం ఊపందుకోకపోవడంతో రెండు పంటలను విక్రయించేందుకు రైతులు రోడ్డెక్కాల్సి వస్తున్నది. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై రైతులు గంటలకొద్దీ బైఠాయించి తమ పంటలను కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం దిలావర్పూర్ మండలం గుండంపెల్లి ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై దిలావర్పూర్, నర్సాపూర్(జీ) మండలాలకు చెందిన వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 5 గంటలకు పైగా ప్రధాన రోడ్డుపై ధర్నాకు దిగడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
గురువారం భైంసా మండలం మాటేగా టోల్‌ప్లాజా వద్ద మక్కలను కొనాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తానూర్, బెల్తరోడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్ లారీల సమస్యతో కొనుగోలు ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన మక్క రైతులు తానూర్-భైంసా రహదారిపై ధర్నాకు దిగారు. తాజాగా శుక్రవారం నర్సాపూర్(జీ) మండలం అర్లి ఎక్స్ రోడ్డు వద్ద లోకేశ్వరం మండలానికి చెందిన వందలాది మంది రైతులు నిర్మల్ – భైంసా 61 నంబర్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
వడ్లు, మక్కలు కొనడంలో జాప్యం నిరసిస్తూ ఆందోళన, లోకేశ్వరం తహసీల్దార్ సూర్యారావు ధర్నా స్థలానికి చేరుకొని రైతులను ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించగా కొంతమంది రైతులు ఆయన కాళ్లకు దండంపెట్టి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. రేపటిలోగా గన్నీ బ్యాగులతో పాటు, లారీల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఆందోళనలకు దిగిన ప్రతిసారి అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి హామీలిస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మక్కల కొనుగోళ్లపై అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని రైతులు మండిపడుతున్నరు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే మక్కలతో పాటు వరి ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని కోరుతున్నారు.
నర్సాపూర్(జీ), మే 8 : కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పోసి రెండు నెలలైంది. ఇప్పటివరకూ ఒక్క సంచి కొనలేదు. అప్పటి నుంచి పడిగాపులు కాస్తున్నాం.తింటే తిండి పోత లేదు, పంటే నిద్ర రావడం లేదు. వర్షానికి విత్తనాలు మొలకెత్తే పరిస్థితి నెలకొన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మాత్రం నెల నెలా జీతం తీసుకుంటున్నారు. మక్కలు విక్రయిస్తేనే మాకు డబ్బులు చేతికి వస్తాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి మక్కలు కొనాలే.
– నవీన్,రాజురా గ్రామం, లోకేశ్వరం
రేవంత్‌రెడ్డి అచ్చిన కాడి సంది రైతులం అరిగోస పడుతున్నం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేం దుకు ముప్పుతిప్పలైతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ బాధలు లేకుండే. టైంకు పంటలు కొన్నడు. రైతుబంధు ఇచ్చిండు. యూరియా తిప్పలు లేకుండే. ఈ కాంగ్రేసోళ్లకు ఓట్లేసి గెలిపించినందుకు రైతులంతా బాధపడుతున్నరు. మళ్లీ కేసీఆర్ సారే రావాలి.
-నైనం నారాయణ, కనకాపూర్, లక్ష్మణచాంద మండలం