భైంసా టౌన్, మే 24 : “మూడు వారాలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాం. భార్యాపిల్లతో రాత్రీపగలు అనే తేడా లేకుండా జాగారం చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుతో కొనుగోళ్లతో జాప్యం అవుతున్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం మొలకెత్తింది. మా రెక్కల కష్టం నీటి పాలవుతుంది..” అని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కామోల్, కుంసర, వానల్పాడ్ గ్రామాల రైతులు మాట్లాడుతూ.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికలప్పుడు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు.. ఇప్పుడు రైతులు కష్టాల్లో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. క్వింటాలుకు 7 నుంచి 10 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నా.. ప్రజాప్రతినిధులు ఎందుకు మోనంగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే గడపడంతో ఖరీఫ్ పనులకు సన్నద్ధం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యాపిల్లలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టడం, వర్షం వస్తే కవర్లు కప్పడంతోనే కాలం గడిచిపోతున్నదని అంటున్నారు. కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
భైంసా మండల వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేయగా.. దిగుబడి 62 వేల క్వింటాళ్లు వచ్చిందని, 1000 ఎకరాల్లో సన్నరకం సాగు చేయగా.. 18 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఐకేపీ ఆధ్వర్యంలో 12, పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద 368 మంది రైతులు దొడ్డురకం 15,494 క్వింటాళ్లు రాగా.. 5,069 క్వింటాళ్ల కొనుగోలు చేశారు. 120 మంది రైతులు సన్నరకం 5,907 కొనుగోలు కేంద్రాలకు చేరగా.. 3,761 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. తేమ శాతం పేరిట క్వింటాలు ధాన్యానికి అధికారులు ఏడు నుంచి పది కిలోలు వరకు కోత విధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తరలించాలని వేడుకుంటున్న ఎవరు పట్టించుకోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
– రాజారెడ్డి, రైతు, కామోల్
కామోల్ గ్రామానికి చెందిన విఠల్ 100 క్వింటాళ్ల ధాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి గత వారం రోజుల క్రితం తీసుకొ చ్చా. అప్పటి నుంచి అధికారులకు విన్నవిం చినా పట్టించుకోవ డంలేదు. మబ్బులు పడ్డ సమయంలో ధాన్యం బస్తాలపై కవర్లును కప్పి కాపలా ఉంటున్నాం. నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేసి ఇబ్బందులను తీర్చాలి.
– విఠల్, రైతు కామోల్