మంచిర్యాల, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తాం. సన్న రకం వరి సాగుకు క్వింటాలు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తాం.’ అని అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తీరా అధికారంలోకి వ చ్చాక అసలు బోనస్ ఇవ్వడం లేదు. గత సీజన్లో కేవలం సన్న రకం ధాన్యానికే బోనస్ ఇస్తామని, అది కూడా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని వెరైటీలకే ఇస్తామం టూ ప్రకటించారు.
మిషన్ పెట్టి మరీ ధాన్యం గింజ పొడు వు, వెడల్పు కొలిచి మరీ బోనస్‌కు ఎంపిక చేశారు. ప్రభు త్వం చెప్పిన వెరైటీలకే బోనస్ అనడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రకాల సన్న రకాలు సాగు చేసిన రైతుల్లో దాదాపు 30 శాతం నుంచి 40 శాతం మంది బోనస్‌కు దూరమయ్యారు. ఇక కొనుగోళ్లు ఆలస్యం అవడం, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో చాలా మంది రైతులు ప్రైవేటుకు విక్రయించారు.
ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బోనస్ వస్తదని ఆశపడి.. అనేక వ్యయప్రయాసలకోర్చి ధాన్యం విక్రయించిన రైతులకు కాంగ్రెస్ సర్కారు నిలువునా ముంచింది. ధాన్యం విక్రయించి రెండు నెలలు పూర్తయి, మరోవైపు యాసంగి సాగు పనులు సాగుతుంటే ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటులో విక్రయిస్తే ఎక్కువ ధర ఇస్తామని దళారులు చెప్పినా.. ప్రభుత్వానికి విక్రయిస్తే బోనస్ వస్తుందను కుంటే రెండూ లేకుండా పోయాయంటూ రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.30.40 కోట్ల బకాయిలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 87,839 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మంచిర్యాల జిల్లాలో సన్నధాన్యం విక్రయించిన రైతుల్లో 7,517 మంది రైతులకు బోనస్ పడగా, 6,796 మంది రైతులకు బోనస్ పడలేదు. ఆసిఫాబాద్ జి ల్లాలో సన్నధాన్యం అమ్మిన రైతులు 1468 మంది ఉండ గా.. వీరిలో 219 మందికి రూ.72 లక్షలు బోనస్ పడింది. ఇంకా 1,249 మందికి రూ.4.93 కోట్లు రావాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో 8,870 మంది రైతుల నుంచి సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు.
ఇంకా 2,483 మంది రైతులకు రూ.4.80 కోట్ల బోనస్ బకాయిలు చెల్లించాలి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల పరిధిలో ఉట్నూర్, దం తంపెల్లి, బీర్సాయిపేట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది రైతులు సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. వీరిలో దాదాపు సగం మందికి బోనస్ పడలేదని తెలుస్తున్నది. అధికారులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.83.93 కోట్ల బోనస్ డబ్బులు పడాల్సి ఉండగా.. ఇప్పటి దాకా రూ.53.53 కోట్ల బోనస్ డబ్బులే పడ్డాయి. దాదాపు రూ.30.40 కోట్ల బోనస్ బకాయి పడింది.
బోనస్ ఇస్తమంటేనే వడ్లు ఇచ్చినం..
దహెగాం, ఫిబ్రవరి10: సన్నవడ్లుకు బోనస్ ఇస్తమంటేనే సొసైటీ వాళ్లకు వడ్లు ఇచ్చినం. ఇప్పటికీ రెండు నెలలైనా బోనస్ డబ్బులు రాలేదు. ప్రైవేటోల్లు నెట్ క్యాష్ ఇచ్చి క్వింటాల్‌కు రూ.2800తో కొన్నారు. అయినా సర్కారు బోనస్ ఇస్తదంటే ఇచ్చినం. నమ్మి మోసపోయినట్లయింది మా పరిస్థితి. జై శ్రీరామ్ వడ్లు 52 క్వింటాళ్లు ఇచ్చినం. క్వింటాల్‌కు రూ 500 చొప్పున మొత్తం 26 వేల రూపాయలు బోనస్ డబ్బులు రావాల్సిన ఉన్నది. తొందరగా బోనస్ డబ్బులు ఇవ్వాలి లేదంటే రైతులందరం కలిసి ఆందోళన చేస్తాం.
-తాడూరి రజిత, పీపీరావు కాలనీ, దహేగాం
వెంటనే డబ్బులు చెల్లించాలి
నేను వర్షాకాలంలో 2.30 ఎకరాల్లో వరి సాగు చేశాను. 34 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని పండించాను. బోనస్ వస్తదంటే ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాను. కానీ ఇప్పటి దాకా క్వింటాల్‌కు రూ.500 బోనస్ రాలేదు. బోనస్ వస్తదనే ఆశతోనే సన్నరకం ధాన్యం పండించాను. కానీ సర్కార్ బోనస్ డబ్బులు వేయలేదు. ఇప్పటికైనా మాకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం.
-గొడిపెల్లి మల్లేశ్, గంగన్నపేట
బోనస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు..
బహిరంగ మార్కెట్లో సన్నరకం ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.2750 ఉన్నప్పటికీ బోనస్ వస్తదంటే దగ్గర్లోని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించినం. ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. మూడున్నర ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగు చేయగా 140 కింటాళ్ల వరి ధాన్యాన్ని షట్‌పల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించగా బోనస్ డబ్బులు మాత్రం జమ కాలేదు. ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలి.
-కందుల వెంకటేశ్, కోటపల్లి
రెండు నెలలైనా డబ్బులు రాలేదు
దహెగాం, ఫిబ్రవరి10 : బోనస్ వస్తది అంటే నేను 20 క్వింటాళ్ల వడ్లు సొసైటీ వాళ్లకు ఇచ్చిన. రెండు నెలలైనా సన్నవడ్ల బోనస్ డబ్బులు రాలేదు. అప్పుడే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 2800 ధర పెడుతామంటే వాళ్లకు ఇవ్వకుండా సొసైటీ వాళ్లకు అమ్మిన. బోనస్ డబ్బులను సొసైటీ వాళ్లను అడిగితే వస్తాయ్ అంటున్నారు కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రాలేదు. ఇస్తరు అనే నమ్మకం కూడా లేదు. రైతులను ఇట్ల ఇబ్బంది పెట్టుడు సరికాదు.
-తుమ్మిడి వెంకటేశ్, దహెగాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..
రైతులు విక్రయించిన సన్న ధాన్యం : 87,839 మెట్రిక్ టన్నులు
చెల్లించాల్సిన బోనస్ : రూ.83.93 కోట్లు
చెల్లించిన బోనస్ : రూ.53.53 కోట్లు
బకాయిపడిన బోనస్ : రూ.30.4 కోట్లు