భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. పల్లె ప్రకృతి వనాలు కూడా ఎడారిని తలపిస్తున్నాయి. పశువులు, ముగజీవాలు, పక్షులు నీటి కోసం తండ్లాడుతున్నాయి. మండలంలోని హర్కాపూర్తండాకు చెందిన జాదవ్ దశరథ్, ఇంద్రవెల్లికి చెందిన ముండే వెంకటి, కేస్లాగూడ(ఎం)కు చెందిన మిర్జా అబ్రార్బేగ్ జొన్న పంటలు సాగు చేశారు. సమయానికి సాగు నీరు అందకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోవడంతో వేల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని.. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.
– ఇంద్రవెల్లి, ఏప్రిల్ 2
ఐదెకరాల్లో జొన్న విత్తనాలు వేసి వదిలేశా..
నాకున్న ఐదెకరాల భూమిలో జొన్న విత్తనాలు విత్తాను. సాగు నీరు లేకపోవడంతో అలాగే వదిలేశా. విత్తనాలతోపాటు భూమిలో దుక్కి దున్నడానికి రూ.35 వేలు ఖర్చు చేశా. భూమిలో జొన్న విత్తనాలు వేసి ఎరువులు కూడా వేశా. అప్పటికి బావి అడుగంటి పోవడంతో వేసిన పంటకు నీరు అందించలేదు. ఎంతో ఆశతో జొన్న విత్తనాలు భూమిలో వేసినా. బావిలో పూడిక మట్టి తీసినా భూగర్భ జలాలు పెరగడం లేదు. నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.
– ముండే సంజీవ్, రైతు, ఇంద్రవెల్లి.
రెండు బ్యాగుల జొన్న పంట ఎండింది..
నాకున్న వ్యవసాయ భూమి లో రెండు బ్యాగుల జొన్న సాగు చేశా. సాగు కోసం రూ.15 వేలు ఖర్చు చేశా. పంట చేతికొ చ్చే సమయానికి నీరు లేకపోవడంతో పంట పూర్తిగా ఎండి పోయింది. ఎండల తీవ్రతకు బోర్ బావులు కూడా అడుగం టి పోయాయి. చొప్ప మాత్రం పశువులకు పనికొస్తుందని ఆవేదన చెందాడు. సమయానికి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చాలా నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి.
– జాదవ్ దశరథ్, హర్కాపూర్తండా, రైతు.