సోన్, సెప్టెంబర్ 12 : ప్రస్తుతం వరి పొలం పొట్ట దశలో ఉండడంతో యూరియా చల్లడం కీలకం. లేదంటే దిగుబడులు తగ్గుతాయని రైతు లు ఆందోళన చెందుతున్నారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎన్నడూ లైన్లో నిల్చోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గంటల తరబడి నిల్చున్నా ఒకటి లేదా రెండు బ్యాగులే ఇస్తున్నారని అది సరిపోక పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. గత నెల రోజుల నుంచి నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలంలోని రైతులు ప్రతి రోజూ బారులు తీరుతున్నారు. పొట్ట దశలో ఉన్న వరికి యూరియా అందించి కాపాడుకునేందుకు అన్ని పనులు వదులుకొని పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎంత దూరమైనా వెళ్లి యూరియాను తెచ్చుకుంటున్నారు. నిర్మల్ మండలంలో వారం రోజుల నుంచి కౌట్ల (కే), మంజులాపూర్, చిట్యాల్‌లో యూరియా లోడ్ వస్తుందని తెలుసుకొని రైతులు ఉదయం 5 గంటల నుంచే ఆధార్‌కార్డు, పాస్బుక్కుల జిరాక్స్‌లతో బారులు తీరుతున్నారు. రెండు బ్యాగులే ఇవ్వడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.
నిర్మల్ మండలం చిట్యాలలోని అభయకృషి సెంటర్‌కు 450 బస్తాలు వచ్చాయని తెలుసుకొని శుక్రవారం తెల్లవారు జామున నుంచే రైతులు బారులు తీరారు. కొందరు రైతులు ముందుగా చెప్పులు, పాస్‌పుస్తకాలు జిరాక్స్‌లతో లైన్ ఉంచి పడిగాపులు కాశారు. రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరడంతో ఒక బస్తా చొప్పున ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చేశారు. రెండు బస్తాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లైన్లో చివరలో ఉన్న రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
లోకేశ్వరం,సెప్టెంబర్ 12: లోకేశ్వరం మండల కేంద్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. యూరియా వచ్చిందని తెలయగానే శుక్రవారం వేకువ జామున నుంచే లోకేశ్వరంలోని పీఏసీఎస్ గోదాం ముందు రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పనులన్నీ వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా సరిపడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఒక్కొక్కరికీ రెండు బస్తాలు చొప్పున ఇస్తున్నారని అవి ఎటూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాది దిలావర్పూర్ మం డలంలోని కాల్వ తండా, యూరియా వచ్చిందని తెలిసి పొద్దున ఆరు గంటలకే చిట్యాలకు వచ్చి లైన్లో నిల్చున్న. ఆధార్‌కార్డుకు రెండు బ్యాగులే ఇచ్చారు. నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది ఎటు సరిపోతది. సర్కారు పట్టించుకొని పొలానికి సరిపడా యూరియా అందించాలే.
-రోహిదాస్, కాల్వతండా (దిలావర్పూర్ )
నా 40 ఏళ్ల వయస్సులో యూరియా కోసం చెప్పు లు, పట్టాదారుపాసుపుస్తకాలు లైనులో పెట్టడం ఎప్పుడు చూడలే. పొద్దున లేచి ఇక్కడికి వచ్చిన. ఇన్నేళ్లలో ఎప్పుడు కూ డా యూరియా కోసం నేను క్యూ కట్టలే. పొలం నాటు వేసినప్పటి నుంచి యూరియాతో కష్టాలు ఎదుర్కొంటున్నా. ఇప్పటికైనా యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నా.
-భూమాగౌడ్, మాయాపూర్, రైతు